![]() |
![]() |
by Suryaa Desk | Mon, Feb 10, 2025, 12:57 PM
విక్టరీ వెంకటేష్ - అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా జనవరి 14 విడుదలైన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కేవలం మూడు వారాల్లోనే రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి ఈ ఏడాది తొలి హిట్‌గా నిలిచింది.24 రోజుల వరకు బాక్సాఫీస్‌ను రూల్ చేసిన వెంకటేష్‌కు ఈ వారం రెండు పెద్ద సినిమాలు రిలీజ్ కావడంతో గట్టి పోటీ ఎదురైంది. మరి సంక్రాంతికి వస్తున్నాం సినిమా 27వ రోజు ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే ...సంక్రాంతికి వస్తున్నాంలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించగా.. వీకే నరేష్, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్, సాయికుమార్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. నటీనటుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను దాదాపు 80 కోట్ల రూపాయల బడ్జెట్‌తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించారు.ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. దాదాపు 42 కోట్లుగా జరిగింది. ఆంధ్రా, నైజాంలో కలిపి 33 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి 9 కోట్ల రూపాయలుగా నమోదైంది. అలా ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు మొత్తంగా 42 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దాదాపు 85 కోట్ల రూపాయలు బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా నిర్దేశించారు ట్రేడ్ పండితులు. అయితే ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరుస్తూ మూడు రోజుల్లోనే ఈ చిత్రం లాభాల్లోకి వచ్చింది. సంక్రాంతికి వస్తున్నాం దాదాపు రూ. 150 కోట్లకు పైగా లాభాలను పంచి పెట్టి నిర్మాతకు, బయ్యర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు నిజమైన సంక్రాంతిని తెచ్చింది. చాలా రోజుల తర్వాత థియేటర్ల వద్ద కూడా పార్కింగ్, క్యాంటీన్ ఆదాయాలు బాగున్నాయని అన్ని ఏరియాల నుంచి రిపోర్ట్స్ వస్తున్నాయి.ఇకపోతే.. 26 రోజుల వరకు నైజాంలో రూ.41.86 కోట్లు, సీడెడ్‌లో రూ.18.69 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.22.14 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ.13.62 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 8.86 కోట్లు, గుంటూరులో రూ.10.31 కోట్లు, కృష్ణాలో రూ.9.54 కోట్లు, నెల్లూరులో రూ. 4.71 కోట్లు చొప్పున మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 129.73 కోట్ల షేర్ రాబట్టింది. కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో రూ.8.85 కోట్లు, ఓవర్సీస్లో రూ. 16.88 కోట్లు అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో రూ.210.05 కోట్ల గ్రాస్ అందుకోగా ప్రపంచవ్యాప్తంగా రూ.155.46 కోట్ల షేర్‌ను రాబట్టింది.
వీకెండ్, వర్కింగ్ డే అన్న తేడా లేకుండా రోజుకు రూ. కోటి తగ్గకుండా షేర్ రాబట్టిన సంక్రాంతికి వస్తున్నాంకు గత వారం వసూళ్లు డల్ అయ్యాయి. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటించిన పట్టుదల ఫిబ్రవరి 6న , ఇక ఫిబ్రవరి 7వ తేదీ అక్కినేని నాగచైతన్య - సాయిపల్లవిల తండేల్ విడుదల అయ్యాయి. వీకెండ్లో మాత్రం వెంకటేష్ రెచ్చిపోయాడు. శనివారం రూ.1.36 కోట్లు రాబట్టిన సంక్రాంతికి వస్తున్నాం.. ఆదివారం ఏకంగా రూ.1.83 కోట్ల గ్రాస్ అందుకుని ఊచకోత కోసింది. సోమవారం నుంచి తిరిగి వర్కింగ్ డేస్ మొదలుకానుండటంతో సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు ఏ స్థాయిలో వసూళ్లు వస్తాయోనని ఉత్కంఠ నెలకొంది. చూద్దాం మరి వెంకటేష్ ఎలాంటి మేజిక్ చేస్తాడో?
Latest News