by Suryaa Desk | Sat, Jul 13, 2024, 08:08 PM
డీసీఎం డ్రైవర్ నిర్లక్ష్యం ఘోర ప్రమాదానికి కారణమైంది. హైదరాబాద్ శివార్లలోని కొత్తూరు వై-జంక్షన్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుకు ఎడమ వైపు నుంచి వచ్చిన ఓ డీసీఎం డ్రైవర్.. వెనకాల వస్తున్న వాహనాలను గమనించకుండా, జంక్షన్ వద్ద ఒక్కసారిగా యూటర్న్ తీసుకునే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో పైపుల లోడుతో వస్తున్న కంటైనర్ డ్రైవర్.. అతి సమీపానికి వచ్చిన తర్వాత ఆ డీసీఎంను గమనించాడు. వెంటనే వాహనాన్ని కుడివైపునకు తిప్పాడు. డీసీఎం అలాగే ముందుకు రావడంతో.. దాన్ని ఢీకొట్టుకుంటూ ఆ ట్రక్కు రోడ్డుకు అవతలి వైపు వెళ్లి, ఎదురుగా కాటన్ లోడుతో వస్తున్న మరో లారీని ఢీకొట్టింది. ఆ దాటికి కాటన్ లారీ ఎడమ వైపు బోల్తాపడింది. ఎడమ వైపు నుంచి వెళ్తున్న స్కూటీ ఆ లారీ కింద నలిగిపోయింది. ఈ ఘటనలో స్కూటర్ నడుపుతున్న అంజయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ.. తీవ్రంగా గాయపడ్డాడు. శుక్రవారం (జూలై 12) మధ్యాహ్నం 2 గంటల 14 నిమిషాలకు జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. డీసీఎం డ్రైవర్ నిర్లక్ష్యం, కంటైనర్ డ్రైవర్ అతివేగం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి.