by Suryaa Desk | Mon, Nov 18, 2024, 07:42 PM
హైదరాబాద్ నగరంలో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఈరోజు (నవంబర్ 18న) తెల్లవారుజాము నుంచి పలు ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా.. ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ అయిన.. స్వస్తిక్ రియల్టర్ కంపెనీలో సోమవారం ఉదయం నుంచి ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. కంపెనీ మేనేజర్లు కల్పనా రాజేంద్ర, లక్ష్మణ్‌ల ఇళ్లతో పాటు షాద్‌నగర్, చేవెళ్ల, గచ్చిబౌలి, బంజారాహిల్స్‌లోని వారి కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నారు. ఇటీవల.. స్వస్తిక్ సంస్థ.. షాద్ నగర్ ప్రాంతంలో ఓ మల్టీ నేషనల్ కంపెనీకి రూ.300 కోట్ల విలువైన భూమిని విక్రయించింది. అయితే భూముల క్రయవిక్రయాలకు సంబంధించిన లెక్కలను మాత్రం బ్యాలెన్స్ షీట్‌లో చూపించలేదన్న ఆరోపణలు గుప్పుమన్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో రంగంలోకి ఐటీ అధికారులు ఎంటరయ్యారు. కాగా.. మరోసారి హైదరాబాద్‌లో ఐటీ దాడులు జరుగుతుండటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
అయితే.. హైదరాబాద్ నగరంలో ఇప్పటికే పలువురు ప్రముఖులతో పాటు ప్రముఖ కంపెనీలపై కూడా దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. మాజీ మంత్రి మల్లారెడ్డి ఇల్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు జరగటం సర్వత్రా సంచలనం రేపింది. అయితే.. ఐటీ సోదాలు జరగటం సర్వసాధారణమని.. మల్లారెడ్డి సింపుల్‌గా తీసిపారేశారు. ఇదే క్రమంలో.. ప్రస్తుత మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై కూడా గతంలో ఐటీ దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఆయన నివాసంతో పాటు రాఘవా కన్‌స్ట్రక్షన్స్ కార్యాలయాలపై, బంధువులు స్నేహితుల ఇండ్లలోనూ ఏకకాలంలో ఐటీ దాడులు జరగటం కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
ఇదిలా ఉంటే.. నగరంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలపై తరచూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తూనే ఉన్నారు. గత నెలలో కూడా.. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ అయిన గూగి ప్రాపర్టీస్ అండ్ డెవలపర్స్, అన్విత బిల్డర్స్ కార్పొరేట్ కార్యాలయాలపైన ఐటీ అధికాలు దాడులు చేశారు. గూగి ప్రాపర్టీస్ అండ్ డెవలపర్స్ అధినేత అక్బర్ షేక్ ఇంట్లోనూ ఆయన కార్యాలయాలలోనూ ఐటీ దాడులు జరిగాయి. అన్విత బిల్డర్స్ అధినేత అచ్యుతరావు నివాసంతో పాటు, బొప్పన శ్రీనివాస్, బొప్పన అనూప్ ఇండ్లలోనూ ఐటీ అధికారులు సోదాలు చేశారు.