by Suryaa Desk | Mon, Nov 18, 2024, 08:08 PM
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే (సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వే 2024) విజయవంతంగా కొనసాగుతోంది.నవంబర్ 6న ప్రారంభమైన ఈ సర్వే కేవలం 12 రోజుల్లోనే 58.3% పూర్తయింది. అన్ని వర్గాల సంక్షేమం, సామాజిక సాధికారత లక్ష్యంగా చేపట్టిన ఈ సర్వే దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందుతోంది. సర్వేలో ముందుగా నవంబర్ 6-8 తేదీల్లో ఇళ్ల గణనను ప్రభుత్వం చేపట్టింది. ఈ దశలో మొత్తం 1,16,14,349 ఇళ్లను గుర్తించారు. నవంబర్ 9న ఇంటింటి వివరాల సర్వే ప్రారంభమైంది. ఇప్పటివరకు 67,72,246 గృహాల సర్వే పూర్తయింది.నవంబర్ 17 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో 64,41,183 ఇళ్లను, పట్టణ ప్రాంతాల్లో 51,73,166 ఇళ్లను సర్వే పూర్తిచేశారు. మొత్తం 1,16,14,349 ఇళ్ల సర్వే కొనసాగుతోంది. సర్వే నిర్వహణకు ప్రభుత్వం బృందాలను ఏర్పాటు చేసింది. మొత్తం 87,807 ఎన్యుమరేటర్లు పాల్గొంటుండగా, వీరికి 8,788 పర్యవేక్షకులు సహకరిస్తున్నారు. మొత్తం 92,901 బ్లాకులుగా సర్వే కొనసాగుతోంది. జిల్లాల వారీగా ములుగు (87.1%), నల్గొండ (81.4%), జనగాం (77.6%), మంచిర్యాల (74.8%), పెద్దపల్లి (74.3%) ముందంజలో ఉన్నాయి. జనసాంద్రత ఎక్కువగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్‌లో సర్వే పురోగతి 38.3%గా నమోదైంది. ఈ సర్వే ద్వారా ప్రభుత్వం సామాజిక వర్గాల స్థితిగతులను అర్థం చేసుకొని, సంక్షేమ పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.