by Suryaa Desk | Mon, Nov 18, 2024, 08:06 PM
లేడీ అఘోరి నాగసాధు గత కొన్నిరోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో హల్‌చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. రెండ్రోజుల క్రితం ఖమ్మం జిల్లా మధిరలో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమానికి అఘోరి హాజరయ్యారు. ఇదే కార్యక్రమంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా లేడీ అఘోరి నందినికి ఎదురుపడగా.. ఆశీర్వాదం తీసుకున్నారు. కాళ్లు మెుక్కి మరీ అఘోరీ ఆశీర్వాదం తీసుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇదిలా ఉండగా.. గతకొన్ని రోజులుగా లేడీ అఘోరి నాగసాధు వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. మొదట తెలంగాణలో అడుగుపెట్టిన అఘోరి.. రాష్ట్రంలో ప్రముఖ ఆలయాలను సందర్శించింది. సికింద్రాబాద్‌లోని ముత్యాలమ్మ తల్లి విగ్రహం ధ్వంసం చేసిన సమయంలో అక్కడికి వెళ్లి పూజలు చేసింది. విగ్రహం ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. దీంతో ఒక్కసారిగా అఘోరి పాపులర్ అయింది. తాను సనాతన ధర్మాన్ని మరింత ముందుకు తీసుకెళ్తానని.. అందులో భాగంగా ఆత్మర్పాణం చేసుకుంటానని సంచలనం రేకెత్తించింది. దీంతో పోలీసులు ఆమెను రెండు రోజుల పాటు నిర్భందించి ఆ తర్వాత విడిచిపెట్టారు.
అనంతరం ఏపీలో ప్రత్యక్షమైన అఘోరి.. ఇక్కడ కూడా పలు ప్రముఖ ఆలయాలను సందర్శించింది. ఈ సందర్భంగా పలు చోట్ల ఆమె వ్యవహార శైలి విమర్శలకు తావిచ్చింది. శ్రీకాళహస్తిలో పెట్రోల్ పోసుకొని హల్‌చల్ చేయగా.. పోలీసులు అదుపులోకి తీసుకొని బట్టలు కట్టించి స్వామి దర్శనం చేయించారు. ఇటీవల కార్తీక పౌర్ణమి సందర్భంగా ఓ స్మశానంలో కార్తీక పౌర్ణమి పూజలు చేయగా.. అందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అత్యాచారాలు, గోహత్యల నివారణకే తాను పూజలు చేశానని చెప్పింది. తాజాగా విజయవాడ మంగళగిరిలో హల్‌చల్ చేసింది. జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లిన అఘోరి తాను పవన్ కల్యాణ్‌ను కలవాలంటూ రహదరిపై బైఠాయించింది. ఆమెను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై ఎదురుదాడి చేసింది.