by Suryaa Desk | Mon, Nov 18, 2024, 09:12 PM
తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అనేక రైతు సంక్షేమ పథకాలు అమలు చేసింది. రూ.2 లక్షల రైతు రుణమాఫీని మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేసింది. మెుత్తం 18 వేల కోట్లు రైతుల అకౌంట్లలో జమ చేశారు. మరికొంత మంది రైతులకు రైతు రుణమాఫీ చేయాల్సి ఉండగా.. ఆ దిశగా చర్యలు తీసుకుంటుంది. రైతు భరోసా పథకం అమలు చేసేందుకు కూడా సిద్దమైంది. అందుకు సంబంధించిన విధివిధానాలు రూపొందిస్తోంది. ఇక కాంగ్రెస్ ఇచ్చిన ప్రధాన హామీల్లో వరికి రూ.500 బోనస్ ఒకటి. ఇప్పటికే రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కాగా.. సన్న రకం వరి సాగు చేసి కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన రైతులకు బోనస్ చెల్లింపులు ప్రారంభించింది.
ప్రతి క్వింటాకు రూ.500 చొప్పున రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తోంది. శనివారం (నవంబర్ 16) నాటికి రూ.6,43,32,200 రైతుల అకౌంట్లలో జమ చేసినట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. మరో రూ.2,78,94,800 చెల్లింపుల ప్రక్రియలో ఉన్నాయని వివరించారు. సన్న రకం ధాన్యానికి బోనస్ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో పెద్దఎత్తున సన్న రకాల వడ్లు సాగు చేశారు. ధాన్యం కొనుగోళ్లలో.. దొడ్డు రకాలకు, సన్నాలకు రాష్ట్రం ప్రభుత్వం వేర్వేరుగా కేంద్రాల్ని ఏర్పాటు చేసింది. అన్నదాతలకు ముందు మద్దతు ధర చెల్లిస్తుండటంతో పాటుగా.. సన్నాలు అమ్మినవారి వివరాల్ని విడిగా నమోదు చేస్తున్నారు.
ఆయా రైతులకు చెల్లించాల్సిన బోనస్ లెక్కల వివరాల్ని ఆర్థికశాఖ ఈ-కుబేర్ యాప్‌నకు పంపిస్తున్నారు. అందులో తెలంగాణ సివిల్ సప్లయ్ కమిషనర్ పీడీ అకౌంట్ ప్రత్యేకంగా ఉంది. ఈ నెల 13, 14, 16 తేదీల్లో ఈ అకౌంట్‌లో 42 చెక్కుల ద్వారా మెుత్తం రూ.9,22,27,000 పౌరసరఫరాల శాఖ జమ చేసింది. బోనస్ చెల్లింపులు తొలిసారి కావడంతో ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. శనివారం నాటికి తెలంగాణ వ్యాప్తంగా 1,82,149 మంది రైతుల నుంచి 12.29 లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఇందులో దొడ్డు రకం వరి 9.53 లక్షల టన్నులు కాగా.. సన్నాలు 2.76 లక్షల టన్నులుగా వివరించారు.