by Suryaa Desk | Sat, Jul 13, 2024, 10:10 PM
దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే జాతీయ రహదారుల్లో హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవే ఒకటి. ఈ జాతీయ రహదారిపై రోజుకు వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఏపీ-తెలంగాణ మధ్య ఈ హైవే వారధిలా ఉంటుంది. పండగల సమయంలోనేతై ఈ రహదారి అత్యంత రద్దీగా ఉంటుంది. కి.మీ మేర వాహనాలు బారులు తీరుతుంటాయి. ప్రస్తుతం ఈ రహదారి నాలుగు వరుసలుగా ఉండగా.. విస్తరణ చేపట్టాలనే ఎప్పట్నుంచో డిమాండ్లు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఇటీవల తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కేంద్ర జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. రోడ్డు విస్తరణపై కేంద్రమంత్రితో కోమటిరెడ్డి చర్చించగా.. కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీంతో ఈ రహదారిని ఆరు వరుసలుగా అప్‌గ్రేడ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో రహదారి విస్తరణకు కసరత్తు మెుదలైంది. ఈ రహదారి విస్తరణ డీపీఆర్ రూపొందించే బాధ్యతను ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించాలని కేంద్రం తాజాగా నిర్ణయించింది. వచ్చే నెల చివరిలోగా అందుకు సంబంధించిన టెండర్లు ఆహ్వానించేందుకు వీలుగా అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు.
తెలంగాణలో 181.5 కిలోమీటర్లు ఉన్న రహదారిని 2010లో అప్పటి ప్రభుత్వం నాలుగు వరుసలుగా నిర్మించింది. అప్పట్లోనే ఆరు వరుసలకు సరిపడా భూ సేకరణ చేశారు. ప్రస్తుతం రహదారి విస్తరణకు భూసేకరణ అవసరం లేకపోవడం... యుటిలిటీస్ తరలింపు విషయంలో ఎలాంటి చిక్కుముడులు లేకపోవడంతో రోడ్డు విస్తరణ పనుల ప్రక్రియ వేగంగా జరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. రహదారిపై అవసరమైన చోట కల్వర్టులు, పాదచారుల వంతెనలను (ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు) నిర్మించే ప్రాంతాల్లో ఇప్పటికే విస్తరణ పూర్తయినట్లు అధికారులు తెలిపారు.
అయితే హరితహారంలో భాగంగా గతంలో ఈ రహదారికి ఇరువైపులా పెద్ద ఎత్తున చెట్లను నాటారు. ప్రస్తుతం అవి ఏపుగా పెరగ్గా.. విస్తరణలో భాగంగా వాటన్నింటిని తొలగించాల్సి వస్తుంది. అలాగే.. రహదారిపై సాఫీగా జర్నీ సాగేందుకు గాను.. ప్రస్తుతం ఉన్న రహదారికి సమానంగా కొన్ని ప్రాంతాల్లో ఎత్తు పెంచాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న నాలుగు వరుసలకు రెండు వైపులా ఒక్కో వరుస చొప్పున కొత్తగా రహదారి నిర్మించాల్సి ఉంటుంది. ఈ విస్తరణ పనులకు సుమారు రూ.600 కోట్ల నుంచి రూ.700 కోట్ల వరకు ఖర్చవుతుందని అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. డీపీఆర్ సిద్ధమయ్యే నాటికి ఎంత వ్యయం అవుతుందన్నది స్పష్టత రానుంది. మెుత్తంగా ఈ రహదారి విస్తరణ పూర్తయితే ఈ రూట్లలో ప్రయాణించే వారు మరింత సురక్షితంగా సాఫీగా స్పీడ్‌గా తమ ప్రయాణాలు సాగించనున్నారు.