![]() |
![]() |
by Suryaa Desk | Tue, Mar 11, 2025, 03:43 PM
జీహెచ్‌ఎంసీలో కంటోన్మెంట్ బోర్డు విలీనంపై రక్షణ శాఖ, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. విలీనానికి సంబంధించి గతంలోనే అధికారిక ప్రకటన వెలువడినా తదనంతర ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ క్రమంలో సోమవారం ఆర్మీ అధికారులు జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇలంబరిదిని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఏఓసీ రహదారుల నిర్మాణం, భూసేకరణపై వారి మధ్య చర్చ జరిగినట్టు తెలిసింది. విలీన ప్రతిపాదన నేపథ్యంలో భూసేకరణ చేయాలా, ఆస్తుల బదలాయింపు జరిగితే ఆ అవసరం ఉండదు కదా అన్న చర్చ రాష్ట్ర ప్రభుత్వ అధికార వర్గాల్లో జరుగుతోంది. విలీనానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం గతంలో కమిటీ వేసింది. డిఫెన్స్ ఎస్టేట్ డైరెక్టర్ జనరల్, మిలిటరీ అధికారులు, పురపాలక శాఖ కార్యదర్శి, బోర్డు అధ్యక్షుడు, సీఈఓ, ఆర్మీ సీనియర్ అధికారులతో కూడిన కమిటీ గతేడాది డిసెంబరులో సమావేశమయ్యారు. త్వరలో మరో దఫా సమావేశం ఉంటుందని సమాచారం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితోనూ కమిటీ సభ్యులు పలు అంశాలపై ఇంతకుముందు చర్చించారు.