|
|
by Suryaa Desk | Sun, Jan 25, 2026, 03:40 PM
లక్నోలో గోవధకు సంబంధించిన కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఓ వ్యాపారిని అక్రమంగా ఇరికించేందుకు అతడి భార్యే రెండుసార్లు కుట్ర పన్నినట్టు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంలో నిబంధనలు ఉల్లంఘించిన ముగ్గురు పోలీసు సిబ్బందిపై ఉన్నతాధికారులు వేటు వేశారు.వివరాల్లోకి వెళితే... ఈ నెల 14న లక్నో శివారులోని కాకోరి వద్ద పోలీసులు ఓ ఆన్‌లైన్ పోర్టర్ వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. అందులో సుమారు 12 కేజీల అనుమానిత బీఫ్ దొరికింది. ఆ డెలివరీని అమీనాబాద్‌కు చెందిన వాసిఫ్ అనే వ్యాపారి పేరు మీద బుక్ చేసినట్లు తేలింది. అయితే, వాసిఫ్ తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. టెక్నికల్, ఫీల్డ్ లెవెల్ దర్యాప్తు చేపట్టగా, ఇది కచ్చితంగా వాసిఫ్‌ను ఇరికించేందుకు పన్నిన కుట్రేనని నిర్ధారణకు వచ్చారు.భార్యాభర్తల మధ్య ఉన్న గొడవల కారణంగానే వాసిఫ్ భార్య అమీనా, మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన ఆమె స్నేహితుడు అమాన్‌తో కలిసి ఈ కుట్ర పన్నినట్లు పోలీసులు తేల్చారు. గతేడాది సెప్టెంబర్‌లో కూడా వాసిఫ్ కారులో అనుమానిత బీఫ్ దొరకడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ ఘటన కూడా ఈ కుట్రలో భాగమేనని ఇప్పుడు భావిస్తున్నారు. పోలీసులు అమాన్‌ను అరెస్ట్ చేయగా, అమీనా పరారీలో ఉంది.ఈ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితురాలైన అమీనాను లక్నో హైకోర్టు ఆవరణలోనే అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించిన ముగ్గురు పోలీసు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. న్యాయవాది ఫిర్యాదు మేరకు వారిపై క్రిమినల్ చొరబాటు, బెదిరింపుల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై లక్నో వెస్ట్ డీసీపీ విశ్వజీత్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, ముగ్గురు సిబ్బందిని సస్పెండ్ చేసి రిజర్వ్ పోలీస్ లైన్స్‌కు అటాచ్ చేశామని తెలిపారు. కుట్ర కేసుతో పాటు, సస్పెండ్ అయిన సిబ్బంది చర్యలపై కూడా దర్యాప్తు కొనసాగుతోందని, పరారీలో ఉన్న మహిళను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన వివరించారు.