|
|
by Suryaa Desk | Sun, Jan 25, 2026, 03:29 PM
కేంద్ర ప్రభుత్వం 2026-27 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్న వేళ స్టాక్ మార్కెట్ల కదలికలపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. బడ్జెట్‌లో ఎలాంటి అనూహ్య ప్రకటనలు ఉంటాయోనన్న భయంతో ఈవెంట్‌కు ముందు మార్కెట్లు సాధారణంగా బలహీనపడతాయని, ఆ తర్వాత మళ్లీ పుంజుకుంటాయని గత గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.మార్కెట్ విశ్లేషకుల ప్రకారం 2010 నుంచి 2022 మధ్య కాలాన్ని పరిశీలిస్తే.. బడ్జెట్‌కు వారం రోజుల ముందు నిఫ్టీ సగటున 0.52 శాతం నెగెటివ్ రిటర్న్ ఇచ్చింది. బడ్జెట్ రోజున అధిక ఒడిదొడుకులు నమోదవుతుండగా ఆ తర్వాత వారంలో మాత్రం మార్కెట్లు సగటున 1.36 శాతం లాభపడినట్లు డేటా చెబుతోంది. గత ఐదేళ్లలో నాలుగుసార్లు బడ్జెట్‌కు ముందు నెలలో నిఫ్టీ నష్టాల్లోనే ముగిసింది.ఈసారి బడ్జెట్‌లో వృద్ధికి ఊతమిస్తూనే, ద్రవ్యలోటుపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందని జేఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ నిపుణుడు రాహుల్ శర్మ అంచనా వేశారు. అమెరికా టారిఫ్‌ల వంటి అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు మౌలిక సదుపాయాలు, రక్షణ, రైల్వే రంగాల్లో మూలధన వ్యయాన్ని పెంచవచ్చని భావిస్తున్నారు. అలాగే, జీఎస్టీ రీఫండ్‌లను వేగవంతం చేయడం ద్వారా ఎంఎస్ఎంఈ, తయారీ, గ్రీన్ ఎనర్జీ, ఏఐ, ఎగుమతి రంగాలకు ప్రోత్సాహం లభించవచ్చని పరిశ్రమ వర్గాలు ఆశిస్తున్నాయి.