![]() |
![]() |
by Suryaa Desk | Wed, Mar 19, 2025, 07:39 PM
బీఆర్ఎస్ ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా ఆయనపై SC, ST అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ విషయాన్ని ఎల్బీనగర్ పోలీసులు తెలిపారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి శంకుస్థాపన చేసిన అభివృద్ధి పనులకు మన్సూరాబాద్ బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి తిరిగి శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే చేసిన అనంతరం అవే పనులకు మళ్లీ కార్పొరేటర్ శంకుస్థాపన చేయడంపై బీఆర్ఎస్ కార్యకర్తలు సీరియస్ అయ్యారు. ఆ పనులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత అదే డివిజన్‌లో మరోచోట ఇలాగే శంకుస్థాపన చేసేందుకు ప్రయత్నించగా.. బీఆర్ఎస్ నేత జక్కిడి రఘువీర్ రెడ్డి నిరసన తెలిపారు. వాళ్లను అరెస్ట్ చేసిన పోలీసులు.. అబ్దుల్లాపూర్ మెట్ పీఎస్‌కు తరలించారు.అరెస్ట్ టైమ్‌లో రఘువీర్‌తో పాటు పలువురు కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో వాళ్లను పరామర్శించేందుకు అబ్దుల్లాపూర్ మెట్ పోలీసు స్టేషన్ వచ్చారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్‌పై సీరియస్ అయ్యారు. బీఆర్ఎస్ నేతల మీద దాడుల వెనుక ఆయనే ఉన్నారని ఆరోపించారు. బీజేపీ కార్పొరేటర్లు కొప్పుల నర్మింహా రెడ్డి, వంగ మధుసూధన్ నడుమ హనీమూన్ నడుస్తోందన్నారు. హస్తినాపురం కార్పొరేటర్‌తోనూ హనీమూన్ నడుస్తోందని వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్‌ను కాంగ్రెస్ కార్పొరేటర్ సుజాత నాయక్ ఖండించారు. సుధీర్ రెడ్డి మీద అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఎల్బీనగర్ పీఎస్‌లో కంప్లయింట్ చేశారు.