|
|
by Suryaa Desk | Wed, Apr 30, 2025, 07:57 PM
దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఆయన, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర క్యాబినెట్‌కు ధన్యవాదాలు తెలియజేశారు.ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దార్శనికత నెరవేరబోతోందని అభిప్రాయపడ్డారు. రాహుల్ గాంధీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేయగలిగారని పేర్కొన్నారు. దేశంలో కుల గణన ప్రక్రియను ప్రారంభించిన తొలి రాష్ట్రం తెలంగాణ అని, రాహుల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగానే రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు.కుల గణన ఆవశ్యకతపై కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా పోరాటం చేసిందని, తెలంగాణ కాంగ్రెస్ నేతలు సైతం ఢిల్లీ వేదికగా ఆందోళనలు నిర్వహించారని ఆయన గుర్తు చేశారు. "తెలంగాణ చేసింది.. దేశం అనుసరిస్తోంది" అనే విషయం మరోసారి స్పష్టమైందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.