|
|
by Suryaa Desk | Thu, May 29, 2025, 04:14 PM
తెలంగాణలో అమ్మాయిలకు రేవంత్ రెడ్డి శుభవార్త వినిపించారు. మరో కొత్త పథకానికి నేటి నుంచి శ్రీకారం చుట్టనున్నారు. బాలికల్లో రక్తహీనతను నివారించేందుకు ఇందిరమ్మ అమ్రుతం అనే కొత్త పథకాన్ని నేటి నుంచి అమలు చేయనున్నారు. ఆడపిల్లలకు శక్తినిద్దాం..అరోగ్య తెలంగాణను నిర్మిద్దాం అన్న నినాదంతో ఈ సరికొత్త పథకాన్ని రేవంత్ ప్రభుత్వం తీసుకువచ్చింది. 14 నుంచి 18ఏళ్ల అమ్మాయిలకు అంగన్ వాడీ కేంద్రాల్లో ప్రతి రోజు ఒక పల్లీపట్టితోపాటు చిరుధాన్యాల పట్టీని అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ స్కీమును పైలట్ ప్రాజెక్టుగా భద్రాద్రి కొత్తగూడెం, కొమురం భీం అసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో అమలు చేయనున్నారు. భద్రాద్రి జిల్లాలోని కొత్తగూడెంలో మంత్రి సీతక్క ఈ స్కీమును ప్రారంభించనున్నారు. మారుతున్న ఆహారపు అలవాట్టు, జీవనశైలిలో మార్పులు, అనారోగ్య కారణాలతో అత్యధిక సంఖ్యలో బాలికలు రక్తహీనతతో బాధపడుతున్నారు. ఈ సమస్యను ప్రాథమిక దశలోనే గుర్తించి తగి సమయంలో చర్యలుతీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఇందిరమ్మ అమ్రుతం పథకాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకువచ్చింది. పోషకాహారం కింద పల్లీలు, చిరు ధాన్యాలతో తయారైన చిక్కీలను అంగన్ వాడీ కేంద్రాల ద్వారా బాలికలకు ఫ్రీగా పంపిణీ చేయనుంది. అయితే జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 5ప్రకారం తెలంగాణలో 64.7శాతం బాలికలు రక్తహీనతతో బాధపడుతున్నారు. దీన్ని నివారించేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో ముందుగా ఈ మూడు జిల్లాల్లో ఈ ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా చేపట్టి అనంతరం అవసరం అయితే మార్పులు చేసి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పథకంలో భాగంగా ప్రతిరోజూ ఒకటి చొప్పున నెల రోజులకు 30 చిక్కీలనుఇస్తారు. ప్రతి 15రోజులకు ఒకసారి చొప్పున రెండుసార్లు వీటిని పంపిణీ చేస్తుంటారు. ఒక్కో చిక్కీలు సుమారు 600కేలరీలు, 18 నుంచి 20 గ్రాములు ఉంటాయి. వీటిలో ప్రొటీన్లతోపాటు సూక్ష పోషకాలు వీటిలో ఉంటాయి.