|
|
by Suryaa Desk | Thu, Nov 06, 2025, 05:06 PM
కేటీఆర్‌పై రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో పెరిగిన డ్రగ్, గన్ కల్చర్‌కు కేటీఆరే మూలమంటూ సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ చేస్తున్న 'బాకీ కార్డు' ప్రచారాన్ని తిప్పికొడుతూ, బీఆర్ఎస్ పాలనలో ఇచ్చిన హామీలు, రాష్ట్రంపై పెట్టిన లక్షల కోట్ల అప్పుల సంగతేంటని నిలదీశారు.ఈరోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన అనంతరం తుమ్మల మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత 20 నెలలుగా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థంగా కొనసాగిస్తున్నారని ప్రశంసించారు.రేవంత్ రెడ్డి పాలన కారణంగా పారిశ్రామికవేత్తలు రాష్ట్రం విడిచి వెళ్లిపోతున్నారంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తుమ్మల తీవ్రంగా ఖండించారు. ఇది పూర్తిగా అవాస్తవమని, రోజూ ఎందరో పారిశ్రామికవేత్తలు కొత్త పెట్టుబడులతో తెలంగాణకు వస్తున్నారని స్పష్టం చేశారు.