|
|
by Suryaa Desk | Thu, Nov 06, 2025, 05:26 PM
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యను బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు రెండు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత కంప్యూటర్ టీచర్ల (ఐసీటీ ఇన్‌స్ట్రక్టర్ల) నియామకానికి పచ్చజెండా ఊపింది. రాష్ట్రవ్యాప్తంగా కంప్యూటర్ ల్యాబ్‌లు ఉన్న పాఠశాలల్లో విద్యార్థులకు సాంకేతిక విద్యను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టింది.రాష్ట్రవ్యాప్తంగా 5 లేదా అంతకంటే ఎక్కువ కంప్యూటర్లు ఉన్న 2,837 పాఠశాలలను అధికారులు గుర్తించారు. ఈ స్కూళ్లలో ఔట్ సోర్సింగ్ విధానంలో ఐసీటీ ఇన్‌స్ట్రక్టర్లను నియమించనున్నారు. తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ (టీజీటీఎస్) ద్వారా త్వరలోనే ఈ నియామక ప్రక్రియ చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంపికైన వారికి నెలకు రూ.15,000 చొప్పున పది నెలల పాటు గౌరవ వేతనం చెల్లించనున్నారు. ఈ వ్యయాన్ని సమగ్ర శిక్షా నిధుల నుంచి భరించనున్నారు.