|
|
by Suryaa Desk | Thu, Nov 06, 2025, 05:28 PM
రాష్ట్రంలో ప్రపంచస్థాయి (వరల్డ్ క్లాస్) ఫిలిం సిటీని ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. నిన్న జూబ్లీహిల్స్‌లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ఆయన తెలుగు ఫిలిం క్లబ్‌లో సినీ రంగ ప్రముఖులు, కార్మిక సంఘాల నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ సినీ పరిశ్రమకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.గతంలో ఉమ్మడి రాష్ట్రంలో గానీ, ఇప్పుడు తెలంగాణలో గానీ సినీ పరిశ్రమకు మేలు జరిగిందంటే అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వాల వల్లేనని ఆయన స్పష్టం చేశారు. ఒకప్పుడు చెన్నైలో ఉన్న తెలుగు సినీ పరిశ్రమను హైదరాబాద్‌కు తరలించడంలో, వేలాది మంది కార్మికులకు ఉపాధి కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు కీలక పాత్ర పోషించాయని ఆయన గుర్తుచేశారు. అన్నపూర్ణ, పద్మాలయ, రామానాయుడు వంటి ప్రముఖ స్టూడియోల నిర్మాణానికి ప్రభుత్వమే భూములు కేటాయించిందని వివరించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే, సీనియర్ నటుడు ప్రభాకర్ రెడ్డి విజ్ఞప్తి మేరకు సినీ కార్మికుల కోసం చిత్రపురి కాలనీని ఏర్పాటు చేశామని తెలిపారు. సినీ పరిశ్రమకు ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని భట్టి హామీ ఇచ్చారు.