|
|
by Suryaa Desk | Fri, Nov 14, 2025, 07:30 PM
మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతన్‌శెట్టిపల్లిలో బంగారం అప్పుగా తీసుకుని తిరిగే చెల్లించే వ్యవహారం తీవ్ర వివాదాస్పదంగా మారింది. సాధారణంగా ఎక్కడైనా డబ్బులు అప్పుగా తీసుకుని.. వడ్డీతో సహా చెల్లిస్తారు. కానీ ఈగ్రామంలో మాత్రం ఓ దంపతులు తమ ఇంటి నిర్మాణం కోసం రెండేళ్ల క్రితం ఐదుగురి వద్ద 9 తులాల బంగారం అప్పుగా తీసుకున్నారు బోసు రమణి, రవి అనే దంపతులు. అయితే బంగారం తీసుకుని సమయంలో తులం బంగారానికి తులంన్నర ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు.
అయితే ప్రస్తుతం బంగారం ధర విపరీతంగా పెరగడంతో.. రమణి దంపతులకు బంగారం అప్పుగా ఇచ్చిన వారు.. వడ్డీగా ఇస్తామన్న నాలుగున్నర తులాల గోల్డ్ కలుపుకుని మొత్తం పదమూడున్నర తులాల బంగారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం బంగారం ధర పెరగడంతో రమణి దంపతులు దీనికి నిరాకరించారు. దీంతో వీరికి బంగారం అప్పుగా ఇచ్చిన వారు.. రమణఇ దంపతులపై దాడి చేశారు. అంతటితో ఆగక.. రవిని విద్యుత్ స్తంభానికి కట్టేసి కొట్టారు. ఈ ఘటనపై బాధితులు పోలీసులను ఆశ్రయించినా లాభం లేకుండా పోయింది. రుణదాతలు మళ్లీ దాడి చేసి, రమణి దంపతులను ఇంటి నుంచి బయటకు వెళ్లగొట్టి.. తాళం వేశారు.
రమణి దంపతులు అప్పుగా తీసుకున్న బంగారాన్ని అమ్మి కొత్త ఇల్లు కట్టుకున్నారు. ఇప్పటివరకు వడ్డీ రూపంలో రూ.2 లక్షల వరకు చెల్లించినట్లు బాధితురాలు తెలిపారు. పైగా తము బంగారం అప్పుగా తీసుకున్న సమయంలో.. అనగా 2023లో తులం బంగారం ధర రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు ఉంది. కానీ ప్రస్తుతం అది రూ.1.28 లక్షలకు చేరింది. దీంతో రుణదాతలు తమకు ఒప్పందం ప్రకారం 9 తులాల బంగారానికి, వడ్డీ కింద అదనంగా మరో నాలుగున్నర తులాల బంగారం కలిపి, మొత్తం పదమూడున్నర తులాల బంగారం ఇవ్వాలని ఒత్తిడి చేశారు.
కానీ రమణి దంపతులు తమ వల్ల కాదని చెప్పడంతో రవిని విద్యుత్ స్తంభానికి కట్టేసి విచక్షణారహితంగా కొట్టారు. గట్టిగా హెచ్చరించి వెళ్లిపోయారు. దీంతో రమణి పోలీసులను ఆశ్రయించగా.. వారు వచ్చి ఇంటికి వేసిన తాళం తీయించి వెళ్లారు. కానీ మరుసటి రోజు రుణం ఇచ్చిన వాళ్లు వచ్చి మళ్లీ రవిని కట్టేసి.. కొట్టారు. రమణిపై కూడా దాడి చేశారు. ఇంటి నుంచి గెంటేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రమణి దంపతులు ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందిన తర్వాత ఇప్పుడు మరో గ్రామంలో తలదాచుకున్నారు.