|
|
by Suryaa Desk | Wed, Feb 04, 2026, 03:58 PM
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీసుకుంటున్న నిర్ణయాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లను వరుసగా కొట్టివేయడం రాజ్యాంగానికి గొడ్డలిపెట్టు అని, ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఆయన తీవ్రంగా ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకే స్పీకర్ నడుచుకుంటున్నారని, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించడం లేదని విమర్శించారు.సోషల్ మీడియాలో స్పందిస్తూ, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌పై అనర్హత పిటిషన్‌ను స్పీకర్ కొట్టివేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే సంజయ్‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఫోటోలు, వీడియోలు కళ్లముందు కనిపిస్తున్నా, ఆధారాలు లేవంటూ పిటిషన్‌ను తిరస్కరించడం అర్థరహితమని అన్నారు. ఈ చర్య ద్వారా స్పీకర్ తన పదవికే అవమానం తెస్తున్నారని, అటు సుప్రీంకోర్టు తీర్పును, ఇటు ప్రజాతీర్పును కాలరాస్తున్నారని మండిపడ్డారు.