|
|
by Suryaa Desk | Sun, Feb 22, 2026, 03:20 PM
సరదాగా గడిపేందుకు, ఎంజాయ్ చేసేందుకు హైదరాబాద్ నుంచి చాలా మంది పర్యాటకులు గోవాకు వెళ్తుంటారు. అయితే ప్రస్తుతం నగరం నుంచి గోవాకు చేరుకోవాలంటే రోడ్డు మార్గంలో 15-18 గంటలు పడుతోంది. ఈ సమయాన్ని సగానికి పైగా తగ్గించేందుకు కేంద్రం ప్రభుత్వం కీలక ప్రాజెక్టు తెరపైకి తీసుకొచ్చింది. భారత్ మాల పరియోజనలో భాగంగా ఎకనామిక్ కారిడార్-10 నిర్మాణం చేపట్టేందుకు రెడీ అయింది. ప్రస్తుతం పనాజీ-హుబ్లీ-కొప్పల్-రాయచూరు-మహబూబ్‌నగర్-హైదరాబాద్ మార్గానికి ప్రత్యమ్నాయంగా జర్నీ సమయాన్ని తగ్గించేందుకు పనాజీ-బెలగావి-రాయచూరు-హైదరాబాద్ మార్గాన్ని ప్రతిపాదించారు.
ఈ కారిడార్‌లో భాగంగా పనాజీ-బెలగావి-రాయచూరు భాగాన్ని గ్రీన్ ఫీల్డ్ హైవేగా నిర్మిస్తున్నారు. ఫలితంగా గోవా నుంచి కర్ణాటక, తెలంగాణకు మరింత మెరుగైన కనెక్టివిటీ సాధ్యమవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్-పనాజీ మధ్య నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారి ప్రాజెక్టు పనులను వేగవంతం చేశారు. ఈ ప్రాజెక్టులో నాలుగు లైన్ల యాక్సెస్ కంట్రోల్డ్ రహదారిని నిర్మిస్తున్నారు. మొత్తం రూ.12 వేల కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా గోవా, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల మధ్య రవాణా, వాణిజ్యం, పర్యాటక రంగానికి కొత్త ఊపిరి తీసుకున్నారన్నారు.
ప్రాజెక్టులో కీలకమైన బెలగావి-రాయచూర్ సెక్షన్‌లో ఇప్పటికే భూసేకరణ పూర్తయింది. హ్యామ్ విధానంలో ఈ రహదారిని నిర్మిస్తుండగా.. పూర్తి అయిన తర్వాత ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. దాంతో పాటు పనాజీ, బెలగావి, రాయచూర్, హైదరాబాద్ నగరాలను కనెక్ట్ చేసే ఈ కారిడార్ ద్వారా సరుకు రవాణాకు ఈజీ అవుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి గోవాకు సుమారు 700 కి.మీ దూరం అయితే కొత్త హైవే వల్ల కనీసం 150 కి.మీ వరకు తగ్గనుంది. ఈ జాతీయ రహదారి పూర్తయితే లాజిస్టిక్స్ ఖర్చులు కూడా తగ్గుతాయి. ప్రాంతీయ వ్యాపారం, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు సైతం విస్తరించనున్నారు.
ప్రస్తుతం సూరత్ నుంచి చెన్నై వరకు కారిడార్ నిర్మిస్తున్నారు. ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే తెలంగాణ పరిధిలోని జోగులాంబ గద్వాల జిల్లాలో భాగంగా ఉంది. ఈ హైవే కూడా పనాజీ-హైదరాబాద్ హైవేకు అనుసంధానంగా మారనుంది. ఫలితంగా మరింత మెరుగైన కనెక్టివిటీకి అవకాశం ఏర్పడుతుందని అధికారులు చెబుతున్నారు.