|
|
by Suryaa Desk | Wed, Apr 08, 2026, 12:48 PM
పటాన్చెరు : రైతు ప్రభుత్వం అంటూ ప్రగల్బాలు పలుకుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. గుమ్మడిదల, అన్నారం రైతుల విషయంలో పక్షపాత వైఖరిని అవలంబిస్తూ.. వారి పాలిట ఆశనిపాతంగా మారుతోందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి విమర్శించారు.గుమ్మడిదల మున్సిపల్ కేంద్రంలోని సర్వే నంబర్ 109 లో గల 140 మంది రైతులకు సంబంధించిన 160 ఎకరాలను గత సంవత్సరం TGIIC కి ప్రభుత్వం కేటాయించింది. ఆ సమయంలో నష్టపరిహారంతో పాటు 100 గజాల ఇళ్ల స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చిన.. నేటి వరకు అమలుకావడం లేదంటూ మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో రైతులు మంగళవారం పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ భూములు సేకరించే సమయంలో అప్పటి కలెక్టర్ ఇచ్చిన హామీ మేరకు భూములు కోల్పోయిన 140 మంది రైతులకు 100 గజాలు చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించాల్సిందేనని అన్నారు.
ఇళ్ల స్థలాల కోసం 5 ఎకరాలు సైతం ప్రత్యేకంగా కేటాయించారని రైతులు ఎమ్మెల్యే జిఎంఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్ తో చర్చించి.. ప్రతి రైతుకి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. అదే విధంగా అన్నారం పరిధిలోని సర్వేనెంబర్ 261లో 117 మంది పేద రైతులకు సంబంధించిన 117 ఎకరాల అసైన్డ్ భూములను పరిశ్రమలకు కేటాయించే నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజా ఉద్యమాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో గుమ్మడిదల మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్, సీనియర్ నాయకులు వెంకటేష్ గౌడ్, షేక్ హుస్సేన్, రైతులు పాల్గొన్నారు.