|
|
by Suryaa Desk | Thu, Apr 02, 2026, 01:06 PM
ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగే ఐపీఎల్ మ్యాచ్‌లకు సంబంధించిన వేలాది కాంప్లిమెంటరీ పాస్‌లు, టికెట్లు అర్హులైన యువ క్రికెటర్లకు చేరకుండా.. హెచ్‌సీఏ పెద్దలు వాటిని బ్లాక్ మార్కెట్‌కు మళ్లిస్తున్నారన్నది ప్రధాన ఆరోపణ. సామాన్య భక్తుడికి దేవుడి దర్శనం ఎంత కష్టమో, సామాన్య క్రికెట్ అభిమానికి ఉప్పల్ స్టేడియం టికెట్ దక్కడం అంతకంటే కష్టంగా మారింది. ఈ కృత్రిమ కొరత సృష్టించి కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారంటూ టీసీఏ కార్యదర్శి గురువారెడ్డి ఈడీకి ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో కేవలం టికెట్ల మాఫియానే కాకుండా, క్లబ్ సభ్యత్వాల్లో కూడా భారీ అక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది. గతంలో ఉన్న 103 ఒరిజినల్ క్లబ్‌లను రికార్డుల నుంచి మాయం చేసి, వాటి స్థానంలో 80కి పైగా నకిలీ క్లబ్‌లను హెచ్‌సీఏలో చేర్చారని టీసీఏ ఆరోపిస్తోంది. ఈ నకిలీ క్లబ్‌ల ద్వారా అసోసియేషన్ ఎన్నికల్లో ఓట్లను మేనేజ్ చేయడమే కాకుండా, వాటి పేరిట వచ్చే నిధులను కూడా దారి మళ్లిస్తున్నారనేది వీరి వాదన. పబ్లిక్ ప్రాపర్టీగా ఉండాల్సిన జీహెచ్‌ఎంసీ క్లబ్‌లను కూడా ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేశారన్న అంశాన్ని టీసీఏ తన ఫిర్యాదులో ప్రత్యేకంగా ప్రస్తావించింది.