|
|
by Suryaa Desk | Mon, Mar 23, 2026, 02:29 PM
ధర్మ రక్షణే ధ్యేయంగా, భక్తి భావంతో మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ శ్రీ రాముని ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు.తన సొంత నిధులతో ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చిట్కుల్ జిటిఎన్ కాలనీలో శ్రీ రామచంద్రస్వామి దేవాలయాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా దేవాలయ విగ్రహ ప్రతిష్టా మహోత్సవాలు శనివారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. లోక కళ్యాణార్థం ఆయన చేపట్టిన ఈ శ్రీరామచంద్ర విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ వైభవంగా సాగింది. మొదటి రోజైన శనివారం నీలం మధు దంపతుల ఆధ్వర్యంలో ఉదయం 8:00 గంటలకు గోపూజ, మందిర ముఖ మండపంలో గణపతి పూజ, పుణ్యాహవాచనము నిర్వహించి, భక్తుల సమక్షంలో దీక్షాధారణ, రక్షాబంధన, యాగశాల సంస్కారము వంటి క్రతువులను వేద పండితులు శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. అఖండ దీపస్థాపన, వాస్తు మండపారాధనలతో ఆలయ ప్రాంగణం ముచ్చట గొలిపింది.సాయంత్రం వేళ ప్రతిష్టా మూర్తులకు పంచవింశతి (25) కలశ స్నపనం (బింబ శుద్ధి) నిర్వహించారు. అనంతరం మూర్తులకు దీక్షాధారణ, అంకురార్పణ, అగ్ని ప్రతిష్ట యాగ మండప దేవతా హవనములు జరిపారు. వాస్తు, నవగ్రహ, క్షేత్రపాల దేవతలకు హోమాలు నిర్వహించి పూర్ణాహుతి గావించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు.ఈ వేడుకల్లో చిట్కుల్ గ్రామంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు..