|
|
by Suryaa Desk | Mon, Apr 06, 2026, 12:03 PM
అంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య విలీన గ్రామాలపై మరోసారి వివాదం రాజుకుంది. ఏపీలో కలిపిన ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో విలీనం చేయాలంటూ మంత్రి తుమ్మల (Tummala)నాగేశ్వర రావు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.దీనిపై ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే నిర్ణయం తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారని కూడా మంత్రి తుమ్మల వివరించారు. అయితే ఈ విలీన గ్రామాలపై విభజన నాటి నుంచే వివాదం రగులుతోంది.ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (2014) సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ నిర్ణయం తీసుకుంది. నాటి నుంచి నేటి వరకు రెండు రాష్ట్రాల మధ్య ఇది ఒక ప్రధాన వివాదంగానే కొనసాగుతోంది.
ఏపీలో పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తున్నందున, దాని వల్ల ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొన్ని ప్రాంతాలు ముంపునకు గురవుతాయి. పనులు ఒక రాష్ట్రంలో, ముంపు ప్రాంతాలు, నిర్వాసితుల పునరావాసం (R&R) మరో రాష్ట్రంలో ఉంటే పరిపాలనాపరమైన, న్యాయపరమైన చిక్కులు వస్తాయనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏడు మండలాలను ఏపీలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకుంది. 2014లో ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా ఖమ్మం జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు, బూర్గంపాడు, చింతూరు, కునవరం, వరరామచంద్రాపురం (వీఆర్ పురం), భద్రాచలం (పట్టణ ప్రాంతం మినహా) మండలాలను ఏపీలో (తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో) కలిపారు.అయితే.. మొత్తం ఏడు మండలాలను కాకుండా, భద్రాచలం చురుపక్కల (ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న) ఐదు గ్రామ పంచాయతీలను తిరిగి తమకు ఇచ్చేయాలని తెలంగాణ ప్రభుత్వం ప్రధానంగా డిమాండ్ చేస్తోంది. ఎటపాక, పురుషోత్తపట్నం, పిచ్చుకలపాడు, కన్నాయిగూడెం,గుండాల (బూర్గంపాడు మండలం పరిధిలోనిది) గ్రామాలను తమకు ఇచ్చేయాలని కోరుతోంది.