|
|
by Suryaa Desk | Tue, Mar 24, 2026, 12:09 PM
బీహెచ్ ఈఎల్, రామచంద్రాపురం పరిసరాల్లోని నేషనల్ హైవే 65లో ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోతోందని.. ఈ సమస్యను పరిష్కరించాలని మియాపూర్ ట్రాఫిక్ డివిజన్ పోలీసులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. నేషనల్ హైవే అథారిటీ వాళ్లు వరద సమస్యను పరిష్కరించడానికి ఇరువైపులా వరద కాలువలు నిర్మించినా.. ఔట్‌లెట్లు ఇవ్వడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. మొత్తం 13 ప్రాంతాల్లో రోడ్డు మీద వరద నీరు నిలిచిపోతోందని వివరించారు. దీంతో వర్షాకాలం తీవ్రమైన ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే అమీన్‌పూర్ మండలం బీరంగూడ విలేజ్‌లోని సర్వే నంబరు 996, 997లో ఉన్న ఇండస్ట్రియల్ ఎంప్లాయీస్ కోపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీకి చెందిన లే ఔట్‌ను ఆక్రమించుకుని కొంతమంది 100 గజాల చొప్పున అమ్మేస్తున్నారని సొసైటీ ప్రతినిధులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. 1982లో వేసిన లే ఔట్‌లో పలు సంస్థల్లో పని చేసిన ఉద్యోగులు ప్లాట్లు కొనగా.. ఇప్పుడవి అన్యాక్రాంతం అవుతున్నాయని వాపోయారు. 180 ఎకరాలలో దాదాపు 1650 ప్లాట్లతో లే ఔట్ వేసినట్టు రికార్డులు చూపించారు. అలాగే తమ సొసైటీ పేరిట 30 ఎకరాల పరిధిలో ఉన్న మరో లే ఔట్‌ను కూడా రెండో లేఔట్ వేసి అమ్మేస్తున్నారని వాపోయారు. పైన పేర్కొన్న రెండు లే ఔట్‌లలో పార్కులు, రహదారులను కాపాడాలని కోరారు. మేడ్చల్ జిల్లా - మల్కాజిగిరి జిల్లా కాప్రా మున్సిపాలిటీ పరిధిలోని అమ్ముగూడలోని జేజేనగర్‌ను పైనుంచి వచ్చే వరద ముంచెత్తుతోంది.. వరద కాలువలను విస్తరించాలని హైడ్రా ప్రజావాణిలో అక్కడి నివాసితులు ఫిర్యాదు చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం సర్దార్‌నగర్‌లోని రావిర్యాల పెద్ద చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్‌ను వెంటనే నిర్ధారించాలని అక్కడి ప్లాట్ల యజమానులు హైడ్రా ప్రజావాణిలో కోరారు. ప్రతి ఏటా చెరువు నిండి ఎగువున ఉన్న లే ఔట్లను ముంచేస్తోందని.. వెంటనే చర్యలు తీసుకోవాలనిన్నారు. ఇలా సోమవారం హైడ్రా ప్రజావాణికి మొత్తం 42 ఫిర్యాదులందాయి. హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు, అడిషనల్ డైరెక్టర్ శ్రీ వర్ల పాపయ్యగారు ఈ ఫిర్యాదులను పరిశీలించి పరిష్కార బాధ్యతలను సంబంధిత అధికారులకు అప్పగించారు.ప్రగతినగర్ చెరువుకు ఆనుకుని ఉన్న స్మశానవాటికను కాపాడినందుకు హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్‌ను కలిసి అక్కడి స్థానికులు అభినందనలు తెలిపారు. ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకున్నారంటూ కొనియాడారు.