![]() |
![]() |
by Suryaa Desk | Thu, Feb 13, 2025, 02:52 PM
విష్వక్ సేన్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘లైలా’. రామ్‌నారాయణ్ దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మించారు. ఈ శుక్రవారం సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రవిశేషాలను మీడియాతో పంచుకున్నారు విష్వక్ సేన్. ‘‘విభిన్న పాత్రల్లో నటించాలని ప్రతి నటుడికీ ఉంటుంది. ‘భామనే సత్యభామనే’, ‘మేడం’, ‘చిత్రం భళారే విచిత్రం’ ‘రెమో’ సినిమాలు చూసినప్పుడు నటుడిగా ఇలాంటి పాత్రలు చేయాలనిపించేది. ప్రేక్షకులు కూడా కొత్తదనాన్ని ఇష్టపడుతున్నారు. ప్రయోగాల్ని ఆదరిస్తున్నారు. దర్శకుడు ఈ సినిమా కథ చెప్పేటప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. ఆయన చెప్తున్నంత సేపూ నవ్వుతూనే ఉన్నా. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే సినిమా చేయాలని చాలా కాలంగా ఎదురుచూస్తున్నాను. ఈ కథతో కుదిరింది. థియేటర్లో ఉన్నంత సేపూ మీరు అన్ని విషయాలు మర్చిపోయి సినిమాను ఆస్వాదిస్తారు. ఒక్క క్షణం కూడా చూపు తిప్పుకోకుండా చూస్తారు. ఇందులో నేను పోషించిన ‘సోనూ మోడల్’, ‘లైలా’ రెండూ పాత్రలు వేటికవే విభిన్నం. ఇందులో సోనూ.. లైలాగా మారడానికి గల కారణం అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. ఈ లుక్ కోసం తయారవ్వడానికి దాదాపు రెండు గంటలు పట్టేది. ఇంట్లో వాళ్లు ఈ లుక్‌లో నన్ను చూసి ఆశ్చర్యపోయారు. ఇందులో నటించిన ప్రతి ఒక్కరికీ గుర్తుండిపోయే పాత్ర దక్కింది.దర్శకుడు రామ్‌నారాయణ్ చాలా ప్రతిభావంతుడు. సినిమాను అనుకున్నదానికంటే బాగా తీశారు. నిర్మాత సాహు గారపాటి ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు. లియోన్ జేమ్స్ అద్భుతమైన పాటలు ఇచ్చారు. ఈ సినిమా కుటుంబ ప్రేక్షకులతో పాటు యువతరాన్ని తప్పక ఆకట్టుకుంటుంది. నా కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమా అవుతుంది. ఈ సినిమా కోసం రెండు పాటలు రాయడం మరిచిపోలేని అనుభూతి. ఇప్పటివరకూ ‘లైలా’ గెటప్ బాగుందని చాలా మంది ప్రశంసించారు. చిరంజీవిగారు ‘నాకే కొరకాలనిపించింది’ అని చెప్పడం మర్చిపోలేని ప్రశంస. ఈ సినిమాకు సీక్వెల్ తీయాలనే ఆలోచన ఉంది’’ అని చెప్పారు.
Latest News