|
|
by Suryaa Desk | Mon, Dec 11, 2023, 12:19 PM
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో బీసీ బంధు పథకంను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. బీసీ బంధు పథకంలో బిఆర్ఎస్ ప్రభుత్వం గందరగోళం సృష్టించిందని గాంధీ భవన్ లో మంత్రి పొన్నం మీడియా సమావేశంలో మాట్లాడారు. పథకం అమలుపై పూర్తిస్థాయిలో సమీక్ష నిర్వహించాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు.
తుక్కుగూడ విజయభేరి సభలో సోనియాగాంధీ ఇచ్చిన ఆరు హామీల్లో రెండింటిని అమలు చేశామని పొన్నం ప్రభాకర్ అన్నారు. మిగిలిన హామీలను కూడా అతి త్వరలో అమలు చేస్తామన్నారు. కాంగ్రెస్ అంటే భరోసా అని చెప్పారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది వేలకు పైగా బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామన్నారు. సగటున రోజుకు 45 లక్షల మంది మహిళలు ప్రయాణిస్తున్నారని పొన్నం తెలిపారు. ఉచిత బస్సు సౌకర్యాన్ని బాలబాలికలందరూ వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. బడ్జెట్‌కు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. మరోవైపు ఆర్టీసీని ప్రభుత్వంలో పూర్తిగా విలీనం చేయలేదు. త్వరలో ఆర్టీసీని సమీక్షించి ఉద్యోగులు, ప్రజలకు మేలు జరిగేలా ముందుకు సాగుతామన్నారు.