|
|
by Suryaa Desk | Sun, Jan 25, 2026, 09:18 PM
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవం మేడారంసమ్మక్క-సారలమ్మ జాతర అటు ఆధ్యాత్మికతకు, ఇటు వ్యాపారానికి ప్రధాన కేంద్రంగా మారింది. అయితే.. ఈ జాతరను అడ్డుపెట్టుకుని మద్యం వ్యాపారులు కాసుల వేటలో పడ్డారు. మందుబాబుల డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని.. సిండికేట్‌లుగా ఏర్పడి ఇష్టారాజ్యంగా ధరలు పెంచుతూ సామాన్యుల జేబులకు చిల్లు పెడుతున్నారు. నిబంధనల ప్రకారం విక్రయాలు సాగాల్సిన చోట.. బహిరంగంగానే దోపిడీ జరుగుతున్నా ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జాతర దృష్ట్యా ఎక్సైజ్ శాఖ మేడారం పరిసరాల్లో 22 తాత్కాలిక మద్యం దుకాణాలకు అనుమతులు మంజూరు చేసింది. తొమ్మిది రోజుల పాటు సాగే ఈ విక్రయాలకు గాను.. రోజుకు రూ. 9 వేల చొప్పున ప్రభుత్వం లైసెన్స్ ఫీజు వసూలు చేస్తోంది. దీని ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ. 17.82 లక్షల ఆదాయం సమకూరనుంది. అయితే ఈ లైసెన్స్ దుకాణాల కంటే ముందే వందలాది బెల్ట్ షాపులు, హోటళ్లు, కిరాణా దుకాణాలు జాతర ప్రాంతంలో వెలిశాయి.
గత రెండు నెలల్లోనే ఈ ప్రాంతంలో సుమారు రూ. 1.40 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరిగాయంటే.. ఇక్కడ గిరాకీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మద్యం వ్యాపారులు MRP ధరలను గాలికొదిలేశారు. ఒక్కో బాటిల్‌పై రూ. 50 నుంచి రూ. 100 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. లైట్ బీర్ అసలు ధర రూ. 180 ఉండగా.. జాతరలో రూ. 250కి పైగా విక్రయిస్తున్నారు. స్ట్రాంగ్ బీర్ రూ. 290 వరకు అమ్ముతున్నారు. విస్కీ/బ్రాందీ క్వార్టర్ బాటిల్‌పై కనిష్టంగా రూ. 50 పెంచి విక్రయిస్తున్నారు. దీనివల్ల కొనుగోలుదారులకు, వ్యాపారులకు మధ్య నిత్యం ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి.
అక్రమ విక్రయాలను అరికట్టాల్సిన ఎక్సైజ్ అధికారులు, కేవలం తమకు కేటాయించిన టార్గెట్లను పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారనే ఆరోపణలు వస్తున్నాయి. ఉన్నతాధికారుల నుంచి వచ్చే ఒత్తిడి కారణంగా.. అమ్మకాలు పెరిగితే చాలనే ధోరణితో కింది స్థాయి సిబ్బంది ధరల నియంత్రణను పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. వ్యాపారులతో కుమ్మక్కై.. బెల్ట్ షాపుల నిర్వహణను చూసీచూడనట్లు వదిలేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. భక్తి భావంతో వచ్చే భక్తులను ఇలా ఆర్థికంగా దోచుకోవడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మేడారంలో ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేయాలని, అధిక ధరలకు విక్రయించే వారి లైసెన్సులు రద్దు చేయాలని భక్తులు కోరుతున్నారు.