|
|
by Suryaa Desk | Sun, Jan 25, 2026, 07:47 PM
నానమ్మ ఒడిలో సేదదీరి.. పల్లెటూరి స్వచ్ఛమైన గాలి పీల్చుకుందామని హైదరాబాద్ మహానగరం నుంచి ఆ ముగ్గురు చిన్నారులు ఎంతో సంబరంగా ఊరికి వచ్చారు. నానమ్మపై ఉన్న మమకారంతో వారు పల్లెకు చేరుకున్నారు కానీ.. విధి ఆ పసి ప్రాణాలను తిరిగి వెళ్లకుండానే కాలగర్భంలో కలిపేసింది. ముగ్గురు చిన్నారులు ఒకేసారి నీటి కుంటలో విగతజీవులుగా పడి ఉండటం చూసి ఆ ఊరంతా కన్నీరు మున్నీరవుతోంది.
ఆటపాటల మధ్యే ముంచుకొచ్చిన మృత్యువు..
నాగర్ కర్నూలు జిల్లా ఉరుకొండ మండలం ముచ్చర్లపల్లి గ్రామంలో ఈ హృదయ విదారకర సంఘటన చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాలకు చెందిన స్నేహ (15), ముచ్చర్లపల్లికి చెందిన సిరి (14), శ్రీమన్యు (14) కలిసి నానమ్మను చూసేందుకు గ్రామానికి వచ్చారు. పొలం వద్ద ఆడుకుంటూ గడుపుతున్న సమయంలో వీరిలో ఒకరు ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడిపోయారు. ఆ ఒక్కరిని కాపాడాలన్న ఆరాటంతో మిగిలిన ఇద్దరు కూడా కుంటలోకి దిగి ఊబిలో చిక్కుకుపోయారు.
సహాయం కోసం కేకలు వేసే అవకాశం కూడా లేకుండా.. నిమిషాల వ్యవధిలోనే ఆ ముగ్గురు చిన్నారులు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. నీటిపై తేలుతున్న ఆ పసి మృతదేహాలను చూసి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడుస్తున్న తీరు స్థానికులను కలచివేస్తోంది.
ఒక్కసారిగా విషాదంలో మునిగిన గ్రామం..
తమ పిల్లలు భవిష్యత్తులో ఉన్నత స్థితికి చేరుకుంటారని కలలు కన్న ఆ తల్లిదండ్రులకు.. ఇలా విగతజీవులుగా వారిని చూడాల్సి వస్తుందని ఊహించలేదు. ఒకే కుటుంబానికి చెందిన చిన్నారులు కావడంతో ఆ విషాదం మరింత భారంగా మారింది. సెలవులు ముగిశాక మళ్లీ పట్నం వెళ్లాల్సిన పిల్లలు.. ఇలా అనంత లోకాలకు వెళ్ళిపోవడాన్ని గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పొలాల వద్ద ఉన్న నీటి కుంటల విషయంలో రైతులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.