|
|
by Suryaa Desk | Sun, Jan 25, 2026, 07:42 PM
తెలంగాణ కుంభమేళాగా పిలవబడే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వచ్చే భక్తుల కోసం రవాణా శాఖ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ములుగు జిల్లా మేడారంలో పర్యటించిన రాష్ట్ర రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ , పంచాయతీరాజ్ మంత్రి సీతక్క వనదేవతలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తుల రవాణా సౌకర్యాల కోసం ఆర్టీసీ ఏర్పాటు చేసిన తాత్కాలిక బస్టాండ్‌ను వారు ప్రారంభించారు.
మేడారం జాతర సమయంలో భక్తుల రద్దీని తట్టుకునేందుకు ఆర్టీసీ ప్రతి ఏటా తాత్కాలిక బస్టాండ్లను ఏర్పాటు చేస్తోంది. అయితే.. భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు మేడారంలో శాశ్వత బస్టాండ్ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం జాతర కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక బస్టాండ్‌లో భక్తుల సౌకర్యార్థం 50 ప్రత్యేక క్యూలైన్లను సిద్ధం చేశారు.
దీనివల్ల ప్రయాణికులు తోపులాట లేకుండా క్రమపద్ధతిలో బస్సుల కోసం వేచి ఉండవచ్చు. ఈనెల 28 నుంచి 31 వరకు జరిగే జాతర కోసం ప్రాథమికంగా 4 వేల బస్సులను కేటాయించారు. భక్తుల రద్దీ పెరిగితే ఈ సంఖ్యను మరింత పెంచుతామని మంత్రి తెలిపారు. సాధారణంగా జాతర సమయంలో వాహనాలను దూరంగా నిలిపివేస్తారు.. కానీ ఆర్టీసీ బస్సులను మాత్రం భక్తుల సౌకర్యార్థం గద్దెల సమీపం వరకు అనుమతిస్తారు.
మేడారం పరిసర ప్రాంతాల్లో రవాణా వ్యవస్థను బలోపేతం చేయడానికి ములుగులో రూ. 5 కోట్లతో అత్యాధునిక బస్టాండ్‌ను, ఏటూరునాగారంలో రూ. 7 కోట్లతో కొత్త బస్‌డిపోను నిర్మిస్తున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం మేడారం జాతరకు వచ్చే మహిళా భక్తులకు కూడా వర్తిస్తుంది. అంటే మహిళలు ఉచితంగా బస్సుల్లో మేడారం చేరుకోవచ్చు. మరోవైపు.. మేడారంలో భక్తులు అమ్మవార్లకు సమర్పించే బెల్లం (బంగారం) విషయంలో కొన్ని ఆంక్షలు అమలులో ఉన్నాయి.
గుడుంబా తయారీకి బెల్లం తరలిపోకుండా ఉండాలని ఎక్సైజ్ అధికారులు ఆధార్ కార్డు వివరాలు అడుగుతున్నారు. దీనివల్ల కొన్ని చోట్ల భక్తులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గత శనివారం ఒక్కరోజే సుమారు 2 లక్షల మంది భక్తులు వనదేవతలను దర్శించుకోవడం జాతర విశిష్టతను చాటుతోంది. ములుగులోని గిరిజన విశ్వవిద్యాలయం ఈ జాతరపై సమగ్ర పరిశోధన చేయాలని నిర్ణయించింది.