|
|
by Suryaa Desk | Sun, Jan 25, 2026, 07:59 PM
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల వేడి ఒక్కసారిగా పెరిగింది. ఆదివారం నిజామాబాద్ జిల్లాలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమీక్షా సమావేశంలో పాల్గొన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. వచ్చే రెండు మూడు రోజుల్లోనే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడుతుందని.. ఫిబ్రవరి నెలలో పోలింగ్ ప్రక్రియ ముగుస్తుందని ఆయన స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు పూర్తి చేసిందని ఆయన వెల్లడించారు.
అభివృద్ధి మంత్రం.. గెలుపే లక్ష్యం..
ఈ ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తేల్చి చెప్పారు. నిజామాబాద్ వంటి నగరాల్లో గతంలో పార్టీ కేడర్ పనితీరు ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్లే పరాజయం ఎదురైందని ఆయన విశ్లేషించారు. అయితే.. ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీకి శ్రీరామరక్షగా మారుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యంగా కొత్త రేషన్ కార్డుల జారీ, పేదలకు సన్న బియ్యం పంపిణీ వంటి నిర్ణయాలు రాష్ట్రంలో 85 శాతం మంది ప్రజలకు మేలు చేస్తాయని.. ఇది ఎన్నికల్లో పార్టీకి అనుకూలంగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాబోయే పదేళ్ల కాలం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
సర్వేల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక..
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. నిజామాబాద్ కార్పొరేషన్‌పై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ప్రకటించారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా ఉంటుందని, గ్రౌండ్ లెవల్ సర్వేల ఆధారంగా ఎవరికి ప్రజాదరణ ఉందో వారికే అవకాశం ఇస్తామని చెప్పారు. టికెట్ల కోసం ప్రలోభాలకు గురికావద్దని.. ఎవరికీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని పార్టీ శ్రేణులకు సూచించారు.
మతాల పేరుతో ఓట్లు అడిగే సంస్కృతి కాంగ్రెస్ పార్టీది కాదని.. అభివృద్ధి ఆధారంగానే తాము ప్రజల ముందుకు వెళ్తామని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. బీజేపీ నాయకులు అబద్ధాలను ప్రచారం చేస్తూ ప్రజల మధ్య విషం నింపుతున్నారని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ఎంత దూరమో.. మజ్లిస్ పార్టీ కూడా అంతే దూరమని ఆయన రాజకీయ వైఖరిని స్పష్టం చేశారు. ప్రజల అభివృద్ధిని విస్మరించి దేవుడి పేరుతో రాజకీయం చేసే వారికి ఈ ఎన్నికల్లో బుద్ధి చెబుతామని నాయకులు పేర్కొన్నారు. నిజామాబాద్ అభివృద్ధి కోసం ‘మన నిజామాబాద్ - మన అభివృద్ధి’ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లనున్నట్లు వివరించారు.