|
|
by Suryaa Desk | Mon, Jan 26, 2026, 04:18 PM
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రజా పాలన లక్ష్యంలో భాగంగా దివ్యాంగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. సోమవారం హుస్నాబాద్ మార్కెట్ యార్డు వేదికగా సైదాపూర్, చిగురుమామిడి మండలాలకు చెందిన దివ్యాంగులకు తెలంగాణ దివ్యాంగుల సహకార సంస్థ ఆధ్వర్యంలో వివిధ రకాల సహాయక ఉపకరణాలను ఆయన పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో మొత్తం 16 మంది అర్హులైన దివ్యాంగులకు సుమారు 15,12,000 రూపాయల విలువైన పరికరాలను అందజేశారు. ఇందులో భాగంగా 10 రెట్రోఫిటెడ్ మోటారైజ్డ్ వాహనాలు (స్కూటీలు), 4 బ్యాటరీతో నడిచే వీల్ చైర్స్, ఒక మొబైల్ బిజినెస్ బ్యాటరీ ట్రై సైకిల్, విద్యార్థుల కోసం ఒక టాబ్లెట్ పంపిణీ చేశారు. గత పదేళ్లుగా ఈ పరికరాల కోసం ఎదురుచూస్తున్న తమను గుర్తించి.. ప్రస్తుత ప్రభుత్వం ఆదుకోవడంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. తమకు అందిన ఈ వాహనాలు కేవలం ప్రయాణానికే కాకుండా, స్వయం ఉపాధి పొందేందుకు.. ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఎంతో దోహదపడతాయని వారు ధీమా వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దివ్యాంగుల్లో ఆత్మవిశ్వాసం నింపడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారని.. దాని కొనసాగింపుగా నియోజకవర్గ స్థాయిలో పంపిణీ చేపడుతున్నామని చెప్పారు. గత పాలనలో దివ్యాంగుల మొర ఆలకించేవారు లేరని.. కానీ తమ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉపకరణాలు అందేలా చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
నియోజకవర్గంలోని అర్హులైన దివ్యాంగులందరూ ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని.. ఎవరికీ అన్యాయం జరగకుండా ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, సైదాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్, వైస్ చైర్మన్ రాజ్ కుమార్, ప్రజా ప్రతినిధులు, వివిధ మండలాల అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చొరవ వల్ల దివ్యాంగులు ఇతరులపై ఆధారపడకుండా తమ పనులను తామే చేసుకునే అవకాశం కలుగుతుందని స్థానిక నాయకులు కొనియాడారు.