|
|
by Suryaa Desk | Mon, Jan 26, 2026, 12:50 PM
గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్ఠాత్మక పోలీస్ పతకాల్లో తెలంగాణ సత్తా చాటింది. రాష్ట్రానికి చెందిన మొత్తం 23 మంది సిబ్బంది ఈ పురస్కారాలకు ఎంపికయ్యారు. విధి నిర్వహణలో అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించిన వారికి ఇచ్చే 'శౌర్య పతకం' ఈ ఏడాది తెలంగాణ నుంచి ఒక్కరికే దక్కింది. సైబరాబాద్ కమిషనరేట్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మర్రి వెంకట్‌రెడ్డి, తన ప్రాణాలను పణంగా పెట్టి చూపిన సాహసానికి గాను ఈ అత్యున్నత పురస్కారాన్ని దక్కించుకున్నారు.కేంద్ర హోంమంత్రిత్వ శాఖ విడుదల చేసిన జాబితా ప్రకారం.. ఇద్దరు అధికారులు పోలీసు శాఖలో అత్యున్నతమైన రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలకు ఎంపికయ్యారు. ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ (ISW) అదనపు ఎస్పీ మంద జీఎస్ ప్రకాశ్ రావు, సీఐ విభాగం ఎస్సై అను దామోదర్ రెడ్డి ఈ గౌరవాన్ని పొందారు. వీరితో పాటు రాష్ట్ర పోలీసు శాఖలోని వివిధ విభాగాల్లో ఉత్తమ సేవలు అందించిన మరో 12 మంది సిబ్బందికి 'ఉత్తమ సేవా పతకాలు' లభించాయి. ఐజీ స్థాయి అధికారి నుంచి కానిస్టేబుల్ వరకు ఈ జాబితాలో చోటు దక్కించుకోవడం విశేషం.