|
|
by Suryaa Desk | Mon, Jan 26, 2026, 12:49 PM
రంగారెడ్డి జిల్లా యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల నుంచి తప్పించుకునేందుకు ఓ యువకుడు తన కారుతో ఎస్సైని ఢీకొట్టి, దాదాపు అర కిలోమీటర్ దూరం బ్యానెట్‌పైనే ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే.. యాచారం బస్టాండ్ వద్ద పోలీసులు ఆదివారం రాత్రి డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో వేగంగా వస్తున్న కారును ఆపాలని పోలీసులు చూశారు. డ్రైవర్ కారును ఆపకపోవడంతో ఎస్సై మధు వాహనానికి అడ్డంగా నిలబడ్డారు. అయినా ఆగకుండా డ్రైవర్ కారుతో ఎస్సైని ఢీకొట్టడంతో ఆయన బ్యానెట్‌పై పడిపోయారు. అయినప్పటికీ నిందితుడు కారును ఆపకుండా వేగంగా ముందుకు పోనిచ్చాడు.ఈ క్రమంలోనే ఓ బైక్‌ను కూడా ఢీకొట్టడంతో వెంకట్ రెడ్డి, ఆయన కోడలు దివ్య, మనవడికి గాయాలయ్యాయి. దివ్య చేయి విరిగింది. యాచారం దాటిన తర్వాత కారు వేగం తగ్గడంతో ఎస్సై మధు బ్యానెట్‌పై నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు.యాచారం పోలీసుల సమాచారంతో ఇబ్రహీంపట్నం సమీపంలోని ఖానాపూర్ వద్ద పోలీసులు కారును అదుపులోకి తీసుకుని ఇద్దరిని అరెస్టు చేశారు.