![]() |
![]() |
by Suryaa Desk | Mon, Mar 10, 2025, 08:55 PM
శ్రీ చైతన్య విద్యాసంస్థల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, ముంబై, పూణే, బెంగళూరు నగరాల్లోని శ్రీ చైతన్య కళాశాలల శాఖల్లో ఏకకాలంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఈ విద్యాసంస్థల్లో అక్రమ లావాదేవీలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఐటీ అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు. విద్యార్థుల నుంచి నగదు రూపంలో ఫీజులు వసూలు చేసి పన్ను ఎగవేతకు పాల్పడినట్లు శ్రీ చైతన్య విద్యా సంస్థలపై అభియోగాలు ఉన్నాయి.మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలో ఉన్న శ్రీ చైతన్య కళాశాల ప్రధాన కార్యాలయంలో కార్పొరేట్ వ్యవహారాలు, విద్యార్థులకు సంబంధించిన లావాదేవీలు జరుగుతున్నాయని సమాచారం. ఇక్కడ సుమారు 20 మంది ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సిబ్బంది సహకారంతో అధికారులు గతంలో ఐటీ శాఖకు సమర్పించిన రిటర్న్స్‌ను పరిశీలిస్తున్నారు. ఈ సోదాలు ఈరోజుతో పాటు రేపు కూడా కొనసాగే అవకాశం ఉంది.విద్యార్థుల నుంచి నిర్దేశించిన ఫీజులను ఆన్‌లైన్‌లో వసూలు చేయడానికి ఒక సాఫ్ట్‌వేర్‌ను, పన్ను ఎగవేతకు మరో సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నట్లు ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. శ్రీ చైతన్య కళాశాలల్లో విద్యార్థుల నుంచి నగదు రూపంలోనే ఫీజులు వసూలు చేయాలని ఒత్తిడి తెస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నగదు రూపంలో వసూలు చేసిన ఫీజులను ఐటీ రిటర్న్స్‌లో చూపకుండా పన్ను ఎగవేస్తున్నారని అనుమానిస్తున్నారు. శ్రీ చైతన్య విద్యా సంస్థలు ప్రతి సంవత్సరం విద్యార్థుల నుంచి ఫీజులు, పరీక్ష ఫీజులు, అడ్మిషన్ ఫీజుల రూపంలో వందల కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నాయి. ఈ లావాదేవీలు ఎక్కువగా నగదు రూపంలోనే జరుగుతున్నాయని, దీని ద్వారా పన్ను ఎగవేసే అవకాశం ఉందని ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు.