![]() |
![]() |
by Suryaa Desk | Tue, Mar 11, 2025, 08:42 PM
అప్పుల విషయంలో కాంగ్రెస్ చేస్తోన్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన అధ్యక్షతన బీఆర్ఎస్ శాసన సభా పక్ష సమావేశం జరిగింది. రేపటి నుండి జరగనున్న అసెంబ్లీ, మండలి సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశనం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తూ కూడా హామీలను నెరవేర్చడం లేదని ఆయన విమర్శించారు.రైతు బంధు, సాగునీరు ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని ఆయన అన్నారు. ప్రభుత్వానికి సరిపడా సమయం ఇచ్చామని ఆయన అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజల గొంతుకగా ప్రభుత్వాన్ని నిలదీయాలని ఆయన సూచించారు. ప్రభుత్వం అవినీతి, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని కేసీఆర్ పేర్కొన్నారు.పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంపై తప్పుడు నిందలను తిప్పికొట్టాలని సూచించారు. బీసీ, ఎస్సీ రిజర్వేషన్ల బిల్లుకు మద్దతుగా గొంతును వినిపించాలని పేర్కొన్నారు. గురుకుల పాఠశాలలు నిర్వీర్యమవుతున్నాయని, దీనిని ప్రశ్నించాలని కేసీఆర్ అన్నారు. ఆరు గ్యారెంటీల హామీలపై, దళిత బంధు నిలిపివేయడంపై అసెంబ్లీలో నిలదీయాలని ఆయన సూచించారు.