|
|
by Suryaa Desk | Thu, Nov 20, 2025, 08:21 PM
ప్రముఖ సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి హనుమంతుడిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఓ కార్యక్రమంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసిన రాజమౌళిని జైల్లో పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు రాజాసింగ్ ఓ వీడియోను విడుదల చేశారు.దేవుళ్లపై నమ్మకం లేనప్పుడు, వారి పేరుతో సినిమాలు తీసి కోట్లాది రూపాయలు ఎందుకు సంపాదిస్తున్నారని రాజమౌళిని నిలదీశారు. ప్రభాస్‌తో ‘బాహుబలి’ సినిమా తీసి, అందులో శివలింగాన్ని ఎత్తించి కోట్లు సంపాదించుకుని, ఇప్పుడు హిందూ దేవుళ్లపై నమ్మకం లేదని మాట్లాడటం సరికాదన్నారు. హిందూ ధర్మంపై అభిమానం లేని రాజమౌళి సినిమాలను హిందువులంతా బహిష్కరించాలని పిలుపునిచ్చారు.‘వారణాసి’ సినిమా ప్రచారం కోసమే ఇలా మాట్లాడారా, లేక నిజంగానే నాస్తికులా అనే విషయంపై రాజమౌళి స్పష్టత ఇవ్వాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. రాజమౌళి హిందూ దేవుళ్లను కించపరచడం ఇది మొదటిసారి కాదని, గతంలో రాముడు, కృష్ణుడిపై కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారని గుర్తుచేశారు. ఇలాంటి దర్శకుడిపై హిందువులు ఫిర్యాదులు చేయాలని ఆయన కోరారు.