|
|
by Suryaa Desk | Wed, Feb 11, 2026, 02:05 PM
భారతీయుల మంచితనాన్ని, స్నేహాన్ని తక్కువగా అంచనా వేయొద్దంటూ ఓ జర్మనీ యువతి చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. భారత్‌లో తనకు ఎదురైన ఓ సమస్య నుంచి ఫ్రెండ్స్ ఎలా ఆదుకున్నారో వివరిస్తూ ఆమె షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. బెర్లిన్‌కు చెందిన జెన్నిఫర్ అనే యువతి ఇటీవల భారత పర్యటనకు వచ్చింది. అయితే ఆమె వెంట తీసుకొచ్చిన ఒక్క క్రెడిట్ కార్డు, పర్సు రెండూ అనుకోకుండా పోవడంతో పూర్తిగా దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయింది. కానీ ఈ సమయంలో భారత్‌లో ఉన్న తన స్నేహితులు అండగా నిలిచి.. ఆమెను ఆ కష్టాల నుంచి బయటపడేశారు. జెన్నిఫర్ తన వీడియోలో మాట్లాడుతూ.. "ఇక్కడ నా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఎప్పుడూ ఓ కంట కనిపెట్టుకుని ఉన్నారు. నా పర్యటన పూర్తయ్యే వరకు నాకు కావాల్సిన డబ్బులు అడిగి మరీ ఇచ్చారు. నాకు క్షణం కూడా ఆందోళన పడాల్సిన అవసరం రాలేదు. ఇలాంటి బ్యాకప్ సిస్టమ్ ఉంటుందని నేను ఊహించలేదు. పర్యటన పూర్తయ్యాక ఎవరి డబ్బులు వారికి తిరిగి ఇచ్చేశాను. భారతీయుల స్నేహాన్ని, ఆతిథ్యాన్ని తక్కువగా అంచనా వేయకూడదు" అని పేర్కొంది.