|
|
by Suryaa Desk | Wed, Feb 11, 2026, 02:06 PM
కేంద్ర ప్రభుత్వం తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాలపై తీవ్ర ఆర్థిక వివక్ష చూపుతోందని, ఇది సమాఖ్య స్ఫూర్తిపై చేస్తున్న దాడి అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్రంగా విమర్శించారు. "సొమ్ములు మావి… గొప్పలు మీవా?" అంటూ కేంద్ర వైఖరిని ప్రశ్నించిన ఆయన, రాష్ట్రం చెల్లించే పన్నులకు, కేంద్రం తిరిగి ఇచ్చే నిధులకు మధ్య భారీ వ్యత్యాసం ఉందని గణాంకాలు సహా వివరించారు.మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, 2024-25లో తెలంగాణ నుంచి పన్నుల రూపంలో రూ.1,33,208 కోట్లు కేంద్రానికి వెళ్తే, కేంద్ర పథకాలతో కలిపి తిరిగి రాష్ట్రానికి వచ్చింది కేవలం రూ.51,725 కోట్లు మాత్రమేనని పార్లమెంట్ సాక్షిగా కేంద్రమే ఒప్పుకుందని తెలిపారు. దేశానికి అధిక ఆదాయం సమకూర్చే దక్షిణాది రాష్ట్రాలకు నిధుల కేటాయింపులో కేంద్రం చిన్నచూపు చూస్తోందని ఆరోపించారు. పన్ను రూపంలో చెల్లించే ప్రతి రూపాయికి దక్షిణాది రాష్ట్రాలకు సగటున 30 పైసలు ఇస్తుంటే, ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాలకు రూ.4 వరకు ఇస్తున్నారని, ఇది ఉత్తర, దక్షిణ రాష్ట్రాల మధ్య విభేదాలు సృష్టించడమేనని అన్నారు."ఇది కేవలం లెక్కల సమస్య కాదు. బలమైన రాష్ట్రాలను ఆర్థికంగా బలహీనపరిచి, తమపై ఆధారపడేలా చేయాలనే రాజకీయ ఉద్దేశం ఇందులో కనిపిస్తోంది" అని తుమ్మల ఆరోపించారు.