|
|
by Suryaa Desk | Wed, Feb 11, 2026, 07:33 PM
మహా శివరాత్రి పండుగ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) 2,243 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 14 నుండి 16వ తేదీ వరకు రాష్ట్రంలోని 43 ముఖ్యమైన శైవక్షేత్రాలకు ఈ ప్రత్యేక సేవలు అందుబాటులో ఉంటాయి. ప్రధానంగా శ్రీశైలానికి 781, వేములవాడకు 416, ఏడుపాయలకు 249, కీసరగుట్టకు 326, వేలాలకు 127, కాళేశ్వరానికి 71 స్పెషల్ సర్వీసులు నడవనున్నాయి. అదేవిధంగా కొమురవెల్లి, అలంపూర్, ఉమామహేశ్వరం, పాలకుర్తి, రామప్ప, తదితర ఆలయాలకు 273 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది.హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్, ఐఎస్ సదన్, కేపీహెచ్‌బీ, బీహెచ్ఈఎల్ నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి. ఆయా ప్రాంతాల్లో షామియానాలు, చైర్‌లు, తాగునీటితోపాటు పబ్లిక్ అడ్రస్ సిస్టంను సంస్థ ఏర్పాటు చేస్తోంది.రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం శివరాత్రికి నడిచే స్పెషల్ బస్సుల్లో టికెట్ ధరలను సంస్థ సవరించింది. ప్రత్యేక బస్సుల్లో 1.5 టైమ్స్ వరకు టికెట్ ధరలను సవరించింది. రెగ్యులర్ సర్వీస్ టికెట్ చార్జీల్లో ఎలాంటి మార్పు ఉండదు. ఈ నెల 14 నుంచి 16వ తేది వరకు (మూడు రోజులు) నడిచే ప్రత్యేక బస్సులకు మాత్రమే సవరణ టికెట్ ఛార్జీలు అమల్లో ఉంటాయి. ఏడుపాయలకు తిరిగే స్పెషల్ బస్సుల్లో 15వ తేదీ నుంచి 17 తేదీ వరకు (మూడు రోజులు) సవరణ చార్జీలు వర్తిస్తాయి. ప్రయాణికులకు సమాచార నిమిత్తం స్పెషల్ సర్వీసులకు బస్సు ముందు భాగంలో డిస్ ప్లే బోర్డులను సంస్థ ఏర్పాటు చేస్తుంది.