|
|
by Suryaa Desk | Wed, Feb 11, 2026, 07:45 PM
మున్సిపల్ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం, ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు పాల్పడిన కాంగ్రెస్ నాయకులపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా మండిపడ్డారు. నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి పోలింగ్ ముగిసే వరకు కాంగ్రెస్ అరాచకాలకు అడ్డూఅదుపు లేకుండా పోయిందని హరీష్ రావు విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను బెదిరించడమే కాకుండా.. వారిపై భౌతిక దాడులకు తెగబడటం అత్యంత హీనమైన రాజకీయ సంస్కృతికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడాల్సిన అధికార పార్టీయే ఇలాంటి దాడులకు పాల్పడటం దుర్మార్గమని ఆయన పేర్కొన్నారు.ఈ క్రమంలో కొందరు పోలీసు అధికారుల ప్రవర్తనను కూడా హరీష్ రావు తప్పుబట్టారు. చట్టాన్ని రక్షించాల్సిన వారే అధికార పార్టీ నాయకుల కళ్లల్లో ఆనందం కోసం పనిచేయడం గర్హనీయమని అన్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తున్నా పట్టించుకోకుండా, అధికార పక్షానికి కొమ్ముకాయడం ప్రజాస్వామ్య వ్యవస్థకే అవమానమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు వ్యవస్థ తన నిష్పాక్షికతను కోల్పోవడం ఆందోళనకరమని వ్యాఖ్యానించారు.