|
|
by Suryaa Desk | Sun, Feb 22, 2026, 06:02 PM
తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. నైరుతి బంగాళాఖాతం పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం రానున్న మరికొన్ని గంటల్లో అల్పపీడనంగా బలపడే సూచనలు ఉన్నాయని చెప్పారు. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని.. దక్షిణ భారత రాష్ట్రాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. అల్పపీడనం ప్రభావంతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యే ఛాన్స్ ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
తెలంగాణలో తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిస్తాయన్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు నేడు ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, రాజన్న సిరిసిల్లా, కరీంనగర్, పెద్దపల్లి, జనగాం, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందన్నారు.
ఇక ఈనెల 23న రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని అన్నారు. హైదరాబాద్ నగరంలో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని అన్నారు. ఉదయం, రాత్రి వేళల్లో పొగమంచు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉందని... గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 33 డిగ్రీల సెంటిగ్రేడ్ నుంచి 20 డిగ్రీల సెంటింగ్రేడ్ వరకు ఉంటాయన్నారు. ఉపరితల గాలులు ఆగ్నేయ తూర్పు దిశలో గంటకు 04-06 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉందని వెల్లడించారు.
అల్పపీడనం ప్రభావంతో ఏపీలోనూ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. ముఖ్యంగా రాయలసీమ, దక్షిణ తీర ప్రాంతాలపై ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపారు. అన్నమయ్య, కడప, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, గుంటూరు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో కొన్ని చోట్ల జల్లులు పడే అవకాశం ఉందన్నారు. ప్రజలు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో నిలబడకూడదని సూచనలు జారీ అయ్యాయి.