|
|
by Suryaa Desk | Sun, Feb 22, 2026, 06:04 PM
తెలంగాణ ప్రజలకు రేవంత్ సర్కార్ తీపి కబురు అందించింది. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి అత్యంత వేగవంతమైన డిజిటల్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. టీ ఫైబర్ ఆధ్వర్యంలో అన్ని గ్రామాల్లో ప్రతి ఇంటికి తక్కువ ఖర్చుతో హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్లు అందించడానికి సర్కార్ రెడీ అవుతోంది. ఇప్పటికే 26 జిల్లాల్లోని సుమారు 9 వేల గ్రామాలకు ఆప్టికల్ ఫైబర్ కేబుల్ రింగ్ కనెక్టివిటీని ఏర్పాటు చేశారు. ఈ పరిధిలో ఇప్పటివరకు లేని రంగారెడ్డి, నిజామాబాద్, ఖమ్మం జిల్లాలను సైతం చేర్చారు. ఈ కనెక్టివిటీ వల్ల వైరు తెగి ఎక్కడైనా అంతరాయం కలిగినా ఆ గ్రామంలో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవు. అన్ని గ్రామపంచాయతీలను ఇదే విధానంలో కనెక్ట్ చేయనున్నారు.
ఈ మూడు జిల్లాల్లో రింగ్ కనెక్టివిటీ కోసం కేంద్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్, ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు పలు సందర్భాల్లో వినతి పత్రాలు అందజేశారు. తాజాగా భారత్ నెట్ సవరణలో భాగంగా నిజామాబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో రింగ్ కనెక్టివిటీకి కేంద్ర ప్రభుత్వం రూ.432 కోట్లు మంజూరు చేసింది. వీటితో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఆప్టికల్ ఫైబర్ కేబుళ్లను పదేళ్ల పాటు మెయింటెనెన్స్ చేసేందుకు అదనంగా మరో రూ.2,697 కోట్లను, పరిపాలన వ్యయం నిధులు కలిపి డిజిటల్ సేవల కోసం తెలంగాణకు రూ.3,185 కోట్లు కేంద్రం విడుదల చేసింది. ప్రస్తుతం టీ ఫైబర్ ఆధ్వర్యంలో రింగ్ కనెక్టివిటీ ఉన్న ఈ జిల్లాల నుంచి 4 గ్రామాలను ఎంపిక చేసుకొని అక్కడి అన్ని ఇళ్లకు ఫ్రీగా ఇంటర్నెట్ కనెక్షన్లను అందిస్తున్నారు. ఈ ప్రయత్నం విజయవంతం కావడంతో దీన్ని సక్సెస్ ఫుల్ మోడల్‌గా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. రింగ్ కనెక్టివిటీ లేని జిల్లాలకు కూడా ఈ విధానాన్ని వర్తింప చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఏబీపీ కార్యక్రమాన్ని 12,769 గ్రామాల్లో అమలు చేసేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. భారత్‌నెట్ ఆస్తులన్నీ జీఐఎస్ మ్యాపింగ్ చేయాలని పేర్కొంది. గ్రామాల్లో ఇంటింటికీ ఎఫ్‌టీటీహెచ్ కనెక్షన్లు ఇచ్చేందుకు భారత్‌నెట్‌ఉద్యమీస్‌ను నియమించాలని స్పష్టం చేసింది. రానున్న ఐదేళ్లలో గ్రామాల్లో ఈ కనెక్షన్లు అందించాలని టార్గెట్‌గా పెట్టుకుంది. ప్రభుత్వ సంస్థలు, స్కూళ్లు, ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలు, పంచాయతీ కార్యాలయాల్ని కనెక్ట్ చేయాలి. ఏబీపీ కార్యక్రమం కింద సెట్‌అప్‌బాక్సు, ఇతర ఖర్చుల కింద 2,93,266 కనెక్షన్లకు కేంద్రం సబ్సిడీ అందిస్తుందని చెప్పారు. తెలంగాణలోని ప్రతి ఇంటికి కనీసం 25 ఎంబీపీఎస్ డౌన్‌లోడ్ వేగంతో.. 691 బ్లాకులకు బీఎస్‌ఎన్‌ఎల్ ఇంటర్నెట్ లీజ్డ్‌లైన్స్ కనెక్టివిటీ అందించాలని కేంద్రం స్పష్టం చేసింది.