![]() |
![]() |
by Suryaa Desk | Thu, Feb 13, 2025, 02:51 PM
ఇవాళ చిన్న సినిమా సైతం ప్రపంచవ్యాప్తంగా ఒకే రోజు విడుదల అవుతోంది. కొన్ని సినిమాలైతే... ఒక రోజు ముందే విదేశాలలో ప్రదర్శింతమౌతున్నాయి. అయితే... అమర గాయకుడు ఘంటసాల బయోపిక్ కు రూటే సపరేట్ గా ఉంది. చాలా యేళ్ళ క్రితమే రూపుదిద్దుకున్న 'ఘంటసాల ది గ్రేట్' సినిమా ఎప్పుడో విడుదల కావాల్సింది. కానీ రకరకాల కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఇటీవల ఈ సినిమా ప్రమోషన్స్ లో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సైతం పాల్గొని రిలీజ్ డేట్ పోస్టర్ ను లాంచ్ చేసి చిత్ర బృందానికి శుభాభినందనలు తెలిపారు.అయితే... నిన్నటి వరకూ 'ఘంటసాల' మూవీ విడుదల అవుతోందో లేదో తెలియని పరిస్థితి. ఆ సంశయానికి తెర దించుతూ దర్శక నిర్మాత సిహెచ్ రామారావు ఓ ప్రకటన గురువారం వెలువరించారు. దాని ప్రకారం 'ఘంటసాల' మూవీ ఒకే రోజున అన్ని కేంద్రాలలో కాకుండా... ఒక్కో జిల్లాలలో ఒక్కో తేదీని విడుదల కాబోతోంది. ఫిబ్రవరి 14న శ్రీకాకుళం జిల్లాతో ఈ చిత్ర ప్రదర్శన మొదలై... ఆగస్ట్ 8న తిరుపతితో ముగుస్తుంది. అయితే... తెలంగాణాలోని జిల్లాల్లో ఈ సినిమా ప్రదర్శన ఎప్పటి నుండి మొదలు అవుతుందో మాత్రం దర్శక నిర్మాత సిహెచ్ రామారావు తెలియచేయలేదు.ఘంటసాల వెంకటేశ్వరరావు జీవితం మీద తెరకెక్కిన బయోపిక్ 'ఘంటసాల ది గ్రేట్'. కృష్ణ చైతన్య టైటిల్ పాత్ర పోషించారు. ఈ సినిమాలో ఘంటసాల భార్య సావిత్రి పాత్రలో కృష్ణ చైతన్య భార్య మృదుల నటించారు. ఇందులో ఇతర కీలక పాత్రలను సుమన్, సుబ్బరాయ శర్మ, దీక్షితులు, మాస్టర్ అతులిత్ పోషించారు. వాసురావు సాలూరి ఈ చిత్రానికి సంగీతం అందించారు. మరి సంగీత ప్రియుల హృదయాలలో శాశ్వత స్థానం సంపాదించుకున్న ఘంటసాల బయోపిక్ కు ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి!
Latest News