|
|
by Suryaa Desk | Sun, Dec 10, 2023, 10:13 PM
ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ప్రముఖ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ స్పందించారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలిచిందని చెప్పడం కంటే బీఆర్ఎస్ ఓడిందని చెబితేనే బాగుంటుందని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకతే వారిని ఓడించిందని అభిప్రాయపడ్డారు.ఇటీవల ఎన్నికలు జరిగిన మధ్య ప్రదేశ్ మినహా తెలంగాణ, చత్తీస్ గఢ్, రాజస్థాన్, మిజోరం రాష్ట్రాల్లో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉందని, ఇతర పార్టీల గెలుపునకు కారణమైందని ప్రశాంత్ కిశోర్ విశ్లేషించారు. మధ్యప్రదేశ్ లో బీజేపీ అధికారం నిలబెట్టుకోగా... తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది. చత్తీస్ గఢ్, రాజస్థాన్ లో బీజేపీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. మిజోరంలో స్థానిక పార్టీల కూటమి జెడ్ పీఎమ్ నెగ్గింది. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ తన సొంత బలంతో గెలవలేదని, తెలంగాణ ఓటర్లు కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం అని భావించి ఓటేశారని, కాంగ్రెస్ విజయానికి ఇదే కారణం అని ప్రశాంత్ కిశోర్ వివరించారు. అంతే తప్ప కాంగ్రెస్ ను చూసి ఎవరూ ఓటు వేయలేదని తెలిపారు. అటు, బీజేపీ విజయాలకు కారణం ఆ పార్టీ హిందుత్వ విధానాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడమేనని అభిప్రాయపడ్డారు.