|
|
by Suryaa Desk | Mon, Dec 11, 2023, 11:17 AM
తెలంగాణలో ధనసరి అనసూయ అలియాస్ సీతక్క నక్సలైట్ కమాండెంట్‌గా అటవీ బాట నుంచి అసెంబ్లీకి మూడోసారి ఎంపికై, ఏకంగా మంత్రి పదవి చేపట్టారు.చిన్న వయసులోనే సాయుధ పోరాటంలోకి దిగిన అనసూయ సీతక్కగా పేరొందారు. 14 ఏళ్ల వయసులోనే నక్సలైట్ ఉద్యమంలో చేరిన అనసూయ నక్సలైట్ కమాండెంట్ గా దళ కమాండర్ స్థాయికి ఎదిగారు. నాడు జైలు జీవితం గడిపిన సీతక్క రాజకీయాల్లో తిరుగులేని నాయకురాలిగా ప్రజాదరణ పొందారు.
అడవుల్లో 15 ఏళ్లకు పైగా ఉద్యమించిన సీతక్క నక్సలిజానికి స్వస్థి చెప్పి జనజీవన స్రవంతిలో కలిశారు. రాజకీయాల్లో చేరి తొలిసారి 2004వ సంవత్సరంలో ములుగు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం 2009వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం 2014 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన సీతక్క ఓటమి చెందడంతో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి తాను సోదరుడిగా పిలిచే రేవంత్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
2018వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో సీతక్క కాంగ్రెస్ పార్టీ టికెట్టుపై పోటీ చేసి ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు. తెలంగాణ కాంగ్రెస్ కార్యనిర్వాహకకమిటీ సభ్యురాలిగా నియమితురాలైన సీతక్క తాజాగా జరిగిన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ములుగు నుంచి 33,700 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ప్రజల్లో ఉన్న సీతక్కకు ఉన్న పాపులారిటీకి నిదర్శనంగా ఆమె మంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తుండగా ఎల్ బి స్టేడియం చప్పట్లు,ఈలలతో మార్మోగి పోయింది.సాక్షాత్తూ రాహుల్ గాంధీ సైతం ములుగు నుంచి ప్రచారం ప్రారంభించారు. సీతక్కకు రేవంత్ రెడ్డితోపాటు రాహుల్ గాంధీతో కూడా మంచి సంబంధాలున్నాయి. న్యాయశాస్త్రంలో పట్టా పొందిన సీతక్క పీహెచ్‌డీ కూడా చేశారు. న్యాయవాదిగా ప్రాక్టీసు చేస్తూ మంత్రి అయిన సీతక్క తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. వరదలు , కోవిడ్ మహమ్మారి వంటి సంక్షోభాల సమయంలో రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో సీతక్క కాలినడకన కొండప్రాంత అటవీ గ్రామాలకు వెళ్లి గిరిజనులకు సహాయం అందించారు.