by Suryaa Desk | Sun, Aug 11, 2024, 07:47 PM
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లికి చెందిన కోడం ప్రణయ్‌కుమార్ అనే ఓ వ్యక్తి.. సంప్రదాయ వంటకాలకు సంబంధించిన వీడియోలను చేసి.. యూట్యూబ్‌లో పెడుతుంటాడు. ఎస్ఆర్ఐ టీవీ అనే యూట్యూబ్ చానెల్‌లో అప్‌లోడ్ చేసే తన వంట వీడియోలకు మంచి ఫాలోయింగే ఉంది. అయితే.. జనాలకు కొత్త కొత్త వంటకాలు చూపించాలన్న ఆశో.. వ్యూస్ రావాలన్న అత్యాశో కానీ.. ఏకంగా జాతీయ పక్షినే కోసి కూర వండేశాడు. శనివారం రోజున.. సంప్రదాయ పద్దతిలో నెమలి కూర ఎలా చేయాలో చూడండి అంటూ "ట్రెడిషనల్ పీకాక్ కర్రీ రెసిపీ" అనే టైటిల్‌తో యూట్యూబ్‌లో వీడియో అప్‌లోడ్ చేశాడు.
ఈ వీడియోను ఆ కన్ను ఈ కన్ను చూసి.. చివరికి జంతుప్రేమికుల కళ్లలోనూ పడింది. ఇంకేముంది.. కామెంట్ సెక్షన్ ఉండనే ఉంది. వీడియో చూసిన వీక్షకులు.. తమ అభ్యంతరాన్ని కామెంట్ సెక్షన్లలో పెట్టేశారు. కొందరు వీడియోకు రిపోర్టులు కూడా కొట్టారు. దీంతో.. ఈ వీడియోను పరిశీలించన యూట్యూబ్.. దానిపై వస్తున్న అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని.. తొలగించింది. అప్పటికే ఈ వీడియోను ఒక 14 వందల మందికి పైగా చూశారు.
ఈ విషయం ఆ నోటా ఈ నోటా నానటంతో.. అసలు అతని ఛానెల్‌లో ఎలాంటి వీడియోలు పెట్టాడన్నది వ్యూవర్స్ వెతకటం ప్రారంభించారు. అడవి పంది కూరకు సంబంధించిన వీడియో కూడా ఉండటంతో.. జంతు ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అడవి జంతువులను చంపడం చట్ట విరుద్దమైన చర్య అని.. అందులోనూ భారత జాతీయ పక్షి నెమలిని చంపి.. దాన్ని కూర వండి వీడియో యూట్యూబ్‌లో పెట్టటమనేది దారుణమని.. తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
ఈ వీడియోపై సంబంధిత అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు నెటిజన్లు. ఇందుకు సంబందించిన ఫోటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తున్నారు. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ఇలాంటి వీడియోలు చేస్తున్న మరికొన్ని యూట్యూబ్ ఛానెళ్ల పేర్లను కూడా ప్రస్తావించాడు. మరి.. ఈ విషయంపై అధికారులు ఎలా స్పందిస్తారన్నది చూడాలి.