by Suryaa Desk | Sun, Aug 11, 2024, 08:00 PM
తెలంగాణకు సూపర్ గేమ్ ఛేంజర్‌గా రీజినల్ రింగు రోడ్డు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉన్న ఔటర్ రింగు రోడ్డుకు సుమారు 40 కి.మీ దూరం నుంచి ఈ రహదారిని నిర్మిస్తున్నారు. అయితే హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డు, ఆర్‌ఆర్‌ఆర్ మధ్య 2,300 నుంచి 2,400 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణానికి రేవంత్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ రహదారులను అనుసంధానం చేసేందుకు రహదారి ప్రణాళిక అవసరమని ప్రభుత్వం సూచించింది. దీంతో రహదారులు, భవనాల శాఖ ఇప్పటికే కసరత్తు మెుదలు పెట్టింది.
ప్రస్తుతం ఔటర్ రింగు రోడ్డుకు, ఆర్‌ఆర్‌ఆర్ మధ్య సుమారు 70 వేల ఎకరాల వరకు భూమి ఉంటుందని రేవంత్ సర్కార్ అంచనా వేస్తోంది. ఈ భూమిని వివిధ క్లస్టర్లుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆయా ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు వీలుగా అంతర్గతంగా రోడ్లను నిర్మించాల్సి ఉంది. ఆ ప్రాంతంలో రహదారులు, భవనాల శాఖ స్టేట్ రోడ్స్ విభాగానికి సుమారు 2 వేల కిలోమీటర్లు, జాతీయ రహదారులు 4 వందల కిలోమీటర్ల వరకు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వాటిని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే అంశంపై ప్రస్తుతం కసరత్తు చేస్తున్నారు.
ఓఆర్ఆర్, ఆర్‌ఆర్‌ఆర్‌కు అనుసంధానంగా మెుత్తం 12 ప్రాంతాల్లో రేడియల్ రోడ్లు డెవలప్ చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇదివరకే ప్రకటించారు. అయితే ఆ రహదారులు ఎటు నుంచి ఎటు నిర్మించాలి ? ఎంత వెడల్పు ఉండాలి ? నిర్మాణ వ్యయం అవుతుంది ? తదితర అంశాలపై ప్రస్తుతం అధికారులు కసరత్తు చేస్తున్నారు. వచ్చే రెండు నెలల్లో ఆ కసరత్తు కొలిక్కి వస్తుందని అధికారులు చెబుతున్నారు. కాగా, ఈ రహదారులు నిర్మించే ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలు రానున్నాయి.
ఇప్పటికే హైదరాబాద్ శివారు ముచ్చింతల్‌లో మరో నగరాన్ని నిర్మిస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. హైదరాబాద్, సైబరాబాద్, సికింద్రాబాద్ నగరాలకు ధీటుగా ఈ నగరం ఉంటుందన్నారు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ నిర్మాణం పూర్తి చేసి.. రేడియల్ రోడ్లు నిర్మిస్తే సగం తెలంగాణ అభివృద్ధి చెందనుంది.