by Suryaa Desk | Sat, Sep 21, 2024, 01:20 PM
ఇందిరా మహిళా శక్తి యూనిట్ల గ్రౌండింగ్ కు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ఇందిరా మహిళా శక్తి ప్రోగ్రాం అమలు పై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణశ్రీ తో కలిసి సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు.ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం క్రింద నిర్దేశించిన 12 రకాల వివిధ వ్యాపార యూనిట్ల ఏర్పాటుకు సంబంధించి మండలాల వారీగా పురోగతి వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. మన జిల్లాలో మొత్తం 8569 వ్యాపార యూనిట్ల ఏర్పాటు లక్ష్యం కాగా ఇప్పటి వరకు 3791 యూనిట్ల ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రూపొందించిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
పాడి పశువులు, మీ సేవా కేంద్రాలు, కుటీర పరిశ్రమలు, పౌల్ట్రీ, ఆహార శుద్ధి కేంద్రాలు, సోషల్ మొబిలైజేషన్ మొదలగు రంగాలలో మహిళలు వ్యాపార యూనిట్ల ఏర్పాటుకు అవసరమైన సలహాలు ఇతర సహాయ సహకారాలను జిల్లా యంత్రాంగం అందిస్తుందని అన్నారు.జిల్లాలో ఇప్పటివరకు 2156 కుటీర పరిశ్రమలు, 6 ఆహార శుద్ధి కేంద్రాలు, 141 పౌల్ట్రీ యూనిట్లు, 4 పౌల్ట్రీ మదర్ యూనిట్లు,1484 సోషల్ మొబిలైజేషన్ యూనిట్ల ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. జిల్లాలో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల మేరకు అమ్మ క్యాంటీన్లు, మీసేవ కేంద్రాలు, పాడి పశువుల యూనిట్లు మహిళా సంఘాల ద్వారా ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం కింద గ్రౌండ్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.స్వశక్తి మహిళా సంఘాలకు ప్రస్తుత సంవత్సరం నిర్దేశించిన బ్యాంకు లింకేజ్ రుణాలను సకాలంలో అందించాలని అన్నారు. మహిళా సంఘాల ఎన్.పి.ఏ 1.5 శాతం లోపు ఉండే విధంగా చూసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.ఈ సమావేశంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కే.రవిందర్ రాథోడ్, అదనపు గ్రామీణ అభివృద్ధి అధికారి రవికుమార్, డిపిఏం, ఏపిఎం లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.