![]() |
![]() |
by Suryaa Desk | Tue, Mar 11, 2025, 12:27 PM
గత జనవరిలో సూర్యాపేట జిల్లాలో ఓ పరువు హత్య జరిగింది. ప్రేమ వివాహం చేసుకున్న బంటి (వడకోండ్ల కృష్ణ) అనే యువకుడ్ని అమ్మాయి తరఫు వారు కిరాతకంగా హత్య చేశారు. పిల్లలమర్రి గ్రామానికి చెందిన బంటి, నవీన్ ప్రాణ స్నేహితులు. బంటి మాల సామాజిక వర్గానికి చెందినవాడు కాగా.... నవీన్ బీసీ కులస్తుడు. నవీన్ చెల్లెలు భార్గవిని ప్రేమించిన బంటి... ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అయితే పక్కా ప్లాన్ ప్రకారం నవీన్ కుటుంబ సభ్యులు... బంటిని హత్య చేశారు. పిల్లలమర్రి గ్రామ సమీపంలోని మూసీ నది వద్ద బంటి మృతదేహం లభ్యమైంది. ఈ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, నిన్న ప్రణయ్ హత్య కేసులో ఓ నిందితుడికి ఉరి శిక్ష, మిగిలిన నిందితులకు జీవిత ఖైదు పడింది. ఈ నేపథ్యంలో... బంటి భార్య భార్గవి స్పందించింది. తన భర్త హంతకులకు కూడా ప్రణయ్ హత్య కేసు నిందితులకు పడిన శిక్షలే వేయాలని కోరింది. ప్రభుత్వం తన కేసులో కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితులకు త్వరగా శిక్షలు పడేలా చూడాలని భార్గవి విజ్ఞప్తి చేసింది. తన భర్త హంతకులకు కచ్చితంగా ఉరిశిక్ష పడాలని పేర్కొంది. కుల దురహంకారంతో హత్యలకు పాల్పడే వారికి ఈ శిక్షలు కనువిప్పుగా ఉండాలని తెలిపింది. తన భర్త బంటి హత్యే చివరిది కావాలని కోరుకుంటున్నట్టు భార్గవి వివరించింది. తనలాగా ఏ అమ్మాయి నష్టపోకూడదని చెబుతూ భావోద్వేగానికి గురైంది.