|
|
by Suryaa Desk | Wed, Jan 21, 2026, 05:11 PM
మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా బాచుపల్లి మండలం, గ్రామంలో 2.30 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. ఆ పక్కనే ఎమ్మార్వో కార్యాలయానికి కేటాయించిన 30 గుంటల ప్రభుత్వ భూమిని కూడా కబ్జాల చెర నుంచి హైడ్రా విడిపించింది. సర్వే నంబరు 142, 143, 144లో ఉన్న 2.30 ఎకరాల ప్రభుత్వ భూమిని 2016లో అప్పటి జిల్లా కలెక్టర్ పార్కు కోసం కేటాయించారు. మొక్కలు నాటి పార్కును అభివృద్ధి చేశారు. అర్బన్ నర్సరీని ఏర్పాటు చేశారు. వందలాది మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచారు. బోర్‌వెల్, వాటర్ సంప్, వాచ్‌మన్ గది, ఇనుప గేట్లు, ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. 2023లో కొంతమంది ప్రైవేటు వ్యక్తులు పార్కులోని మొక్కలను ధ్వంసం చేసి నర్సరీని తొలగించారు. తమ ల్యాండ్‌గా చెబుతూ రాత్రికి రాత్రి ప్రహరీ నిర్మించారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదు మేరకు క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారులతో హైడ్రా పరిశీలించింది. పార్కు స్థలంగానే నిర్ధారించింది. హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారి ఆదేశాల మేరకు మంగళవారం ఆక్రమణలను తొలగించింది. ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ హైడ్రా బోర్డులను ఏర్పాటు చేసింది. అదే సర్వే నంబర్లలో 30 గుంటలు ఎమ్మార్వో కార్యాలయానికి కేటాయించిన స్థలం కూడా కబ్జాలకు గురైతే.. ఆక్రమణలను హైడ్రా తొలగించింది. 30 గుంటల ప్రభుత్వ భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసి హైడ్రా బోర్డులు ఏర్పాటు చేసింది. పార్కు స్థలాన్ని కాపాడడంతో బాచుపల్లి నివాసితులు హైడ్రాకు ధన్యవాదాలు తెలిపారు. హైడ్రా, ప్రభుత్వానికి మద్ధతుగా నినాదాలు చేశారు.